సింగరేణిలో కొత్త గనులతో ఉపాధి : వివేక్ వెంకటస్వామి

సింగరేణిలో కొత్త గనులతో ఉపాధి :  వివేక్ వెంకటస్వామి

 

  • మూడు బొగ్గు బ్లాక్‌‌ల కోసం టెండర్లలో పాల్గొనాలి: వివేక్‌‌
  • ఫిబ్రవరి 2న రైతుభరోసా, రూ.500కు సిలిండర్​పై ప్రకటన
  • త్వరలో రెండు స్కిల్​ డెవలప్‌‌మెంట్ సెంటర్లు ఏర్పాటు
  • చెన్నూరు నియోజకవర్గంలో  పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కోల్‌‌బెల్ట్, వెలుగు:  సింగరేణి సంస్థ మనుగడ సాగించాలంటే కొత్త బొగ్గు గనులు రావాల్సిన అవసరం ఉందని చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. కొత్త గనుల కోసం టెండర్ల ప్రక్రియలో పాల్గొనేందుకు సంస్థ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా టేకుమట్ల గ్రామంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్, వేలాలలో గ్రామ పంచాయతీ భవనం, గంగిపెల్లిలో పల్లె దవాఖాన, మిట్టపెల్లిలో మహిళా భవన్‌‌ను ప్రారంభించారు. గంగిపల్లి గ్రామంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. సింగరేణిలో కొత్త బొగ్గు గనులు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. టెండర్లలో కొత్త బొగ్గు బ్లాక్‌‌లను దక్కించుకోవాల్సిన అవసరాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానన్నారు. ‘‘మా నాన్న కాకా వెంకటస్వామి సింగరేణి సంస్థ అప్పుల్లో కూరుకుపోయినప్పుడు ఎన్టీపీసీ నుంచి రూ.400 కోట్లను ఇప్పించి లక్ష మంది కార్మికులను కాపాడారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌‌ను ఒప్పించి జైపూర్‌‌‌‌లో సింగరేణి ఆధ్వర్యంలో 1,200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ రావడానికి నా తండ్రి కాకా, అన్న వినోద్ ఎంతో కృషి చేశారు”అని వివేక్‌‌ పేర్కొన్నారు. 

సింగరేణి సంస్థను విస్తరించాలి..

 సింగరేణి సంస్థను మరింత విస్తరించాల్సి ఉందని వివేక్‌‌ అన్నారు. థర్మల్ పవర్‌‌‌‌ ద్వారా భారీగా లాభాలు ఆర్జించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెంచేందుకు వీలవుతుందన్నారు. జైపూర్ పవర్ ప్లాంట్‌‌లో 850 మెగావాట్లతో మూడో యూనిట్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. మందమర్రి, చెన్నూరులో త్వరలో స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. జైపూర్ మండలంలో సింగరేణి యాజమాన్యం స్టేడియం నిర్మించి క్రీడాకారులను ప్రోత్సాహించాలని, టార్ఫ్ వికెట్​పిచ్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం సంజీవరెడ్డిని వివేక్‌‌ ఆదేశించారు. సింగరేణి ప్రాంతం నుంచి క్రీడాకారులను జాతీయ, రాష్ట్ర స్థాయిలో తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తమ విశాక ట్రస్ట్ ద్వారా బోర్‌‌‌‌ వెల్స్, ఫర్నిచర్ అందించడం బాధ్యతగా తీసుకున్నామన్నారు. 

ఇంద్రవెల్లి సభలో మరో రెండు గ్యారంటీల ప్రకటన.. 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, సమస్యలు పరిష్కరించేందుకు ముందుంటుందని వివేక్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు అవుతున్నాయని చెప్పారు. పది రోజుల్లో మరో రెండు గ్యారంటీలైన రూ.500కు గ్యాస్ సిలిండర్, రైతు భరోసా అమలు చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి ఈ నెల 2న ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తారన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ రూ.లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో బొట్టు నీళ్లు కూడా రాలేదన్నారు. నియోజకవర్గంలో కాళేశ్వరం బ్యాక్ వాటర్ ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇటీవల సుందరశాల, అన్నారం బ్యారేజీ వద్దకు ఇరిగేషన్ ఆఫీసర్లను తీసుకెళ్లినట్లు చెప్పారు. పేదలకు మెరుగైన వైద్యం కోసం రాష్ట్ర సర్కార్ రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తుందని, కేంద్రం కూడా ఆయుష్మాన్ భారత్ కింద రూ.10 లక్షలు వర్తింపజేసేందుకు ఆలోచన చేస్తుందని తెలిపారు.

త్వరలో తలసేమియా వ్యాధిగ్రస్తులకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తామని చెప్పారు. మిషన్​ భగీరథలో లోపాలపై దర్యాప్తు చేయాలని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నెల రోజుల్లో ఇంటింటికి తాగు నీరు సరఫరాకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇబ్బంది ఉన్న చోట బోర్లు వేసి సమస్య తీరుస్తామన్నారు. వేలాలలోని ప్రముఖ మల్లికార్జునస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పంచాయతీ భవనాలను నిర్మించాలని సంబంధిత అధికారులను ఈ సందర్భంగా వివేక్‌‌ ఆదేశించారు. కార్యక్రమంలో మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, శ్రీరాంపూర్ సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి, డీఆర్‌‌‌‌డీవో శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.