ఫోన్ ట్యాపింగ్ కేసీఆరే చేయించిండు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ఫోన్ ట్యాపింగ్ కేసీఆరే చేయించిండు: ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ మాజీ సీఎం కేసీఆరే చేయించారని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఈ కేసు మామూలుది కాదని, చాలా పెద్ద అంశమని, కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందని ఆయన అన్నారు. శుక్రవారం తుక్కుగూడ జన జాతర సభ ప్రాంగణం వద్ద వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అన్ని విషయాలు  చెప్పారని ఆయన తెలిపారు. అధికారంలో ఉండి.. కేసీఆర్, కేటీఆర్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు.

ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు కనిపించకుండా హార్డ్ డిస్క్ లను రంపంతో ముక్కలు చేసి మూసీ నదిలో పడేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఇప్పుడు అధికారం పోయిందని ఫ్రస్ట్రేషన్ లో ఇష్టమొచ్చినట్లు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆయనకు చీకటి పడితే అన్ని గుర్తుకొస్తాయని వివేక్ వెంకటస్వామి ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కామ్​లో కేసీఆర్ బిడ్డ కవిత జైలుకెళ్లిందని, స్కామ్ లో కవిత ఉందని కేసీఆర్ కు కూడా తెలుసని, అందుకే ఆమె అరెస్ట్ పై ఇంత వరకు స్పందించడం లేదని వివేక్ వెంకటస్వామి విమర్శించారు.

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరిన మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్‌‌‌‌‌‌‌‌

బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం తుక్కుగూడలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ దీపాదాస్ మున్షీ సమక్షంలో  పార్టీలో జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ సభ్యత్వంతోపాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీజీబీకేఎస్‌‌‌‌‌‌‌‌) ప్రెసిడెంట్ పదవికి కూడా రిజైన్ చేస్తున్నట్లు వెంకట్రావ్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.