వేములవాడ, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ పాటించడం అందరి బాధ్యత అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శనివారం వేములవాడ పట్టణంలో అరైవ్ అలైవ్, రన్ ఫర్ రోడ్ సేఫ్టీ 2కే వాకథాన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ముఖ్య అతిథులుగా హాజరై ఇన్చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి.గీతేతో కలిసి వాకథాన్‌ను ప్రారంభించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ, మద్యం మత్తులో, హెల్మెట్లేకుండా వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు చేసిన డ్యాన్స్ లు ఆకట్టుకున్నాయి.
హరీశ్ రావు, కేటీఆర్ కళ్లల్లో భయం కనిపిస్తోంది
ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీశ్‌రావు, కేటీఆర్కళ్లల్లో భయం కనిపిస్తోందని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు. శనివారం వేములవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బావ ఫోన్ ట్యాప్ చేస్తారా అన్న కవిత ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమాలన్నీ బయకొస్తాయని, శిక్షకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
కోరుట్ల: పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం కథలాపూర్ లోని చర్చి 25వ వార్షికోత్సవానికి హాజరయ్యారు. సిరికొండలో 88 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, 44 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక
కోనరావుపేట: ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం కనగర్తిలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. సర్పంచ్ స్వామిదాసు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా పాల్గొన్నారు.
