నియోజకవర్గ పనుల కోసం ఎమ్మెల్యేల చక్కర్లు

నియోజకవర్గ పనుల కోసం ఎమ్మెల్యేల చక్కర్లు
  • ఫైల్స్​ పట్టుకుని మంత్రులు, ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు
  • జనాల నుంచి నిలదీతలు, పైగా ఎలక్షన్​ ఇయర్​ కావడంతో కదలిక
  • రోడ్లు , స్కూళ్లు , ఇతర డెవలప్​మెంట్​ పనులకు అప్రూవల్​ కోసం తంటాలు


హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లో ఏండ్లకేండ్లుగా పనులు పెండింగ్​లో  ఉండటం.. జనం నిలదీస్తుండటం.. పైగా ఎలక్షన్​ ఇయర్​ కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పరేషాన్​ అవుతున్నారు. చిన్నచిన్న పనులైనా చేయించకపోతే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి స్వయంగా వారే ఆ పనులకు సంబంధించిన ఫైల్స్​ను పట్టుకొని హైదరాబాద్​లో మంత్రుల చుట్టూ, ఉన్నతాధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పనులకు గ్రీన్​ సిగ్నల్​ ఇప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. గతంలో ఏ మండలంలో ఏ హామీ ఇచ్చినం.. ఏ ఊరిలో  ఏ పని పెండింగ్​లో ఉంది.. అనే వివరాలను తెప్పించుకొని, వాటితో మంత్రుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇందులో ఎక్కువగా రోడ్లు, హాస్పిటల్స్​(పల్లె దవాఖానలు), మన ఊరు–మన బడి కింద స్కూళ్లలో ఫండ్స్​, మినీ స్టేడియం, నియోజకవర్గ కేంద్రాల్లో అర్బన్​ పార్క్​లు, ఫైర్​ స్టేషన్లు, వెటర్నరీ హాస్పిటల్స్​, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, జూనియర్​ కాలేజీల వంటివి ఉన్నాయి. 

ముందు మంత్రుల వద్దకు వెళ్లి..!

తమ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రపోజల్స్​ కాపీలను స్వయంగా ఎమ్మెల్యేలే పట్టుకుని వస్తున్నారు. ముందు సంబంధిత మంత్రుల దగ్గరకు వెళ్లి.. ‘‘నియోజకవర్గంలో తిరగలేకపోతున్నం అన్న! చిన్న చిన్న పనులు కూడా చేయకపోతే ఎట్లా’’ అంటూ ఫైల్స్​ను మంత్రుల ముందు పెడుతున్నారు. ఉదయం వేళ బంజారాహిల్స్​లోని మినిస్టర్​ క్వార్టర్స్​లో మంత్రులను..  ఆ తర్వాత సెక్రటేరియెట్​, ఆర్​ అండ్​ బీ, ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్, హెల్త్​, పంచాయతీరాజ్​ డిపార్ట్​మెంట్​లో హెడ్​లను కలుస్తున్నారు. ముందు మంత్రులతో ఫోన్​ చేయించుకుని..ఆ తర్వాత సంబంధిత శాఖల కమిషనర్లు, ప్రిన్సిపల్​ సెక్రటరీల దగ్గర అప్రూవల్​ కోసం వెళ్తున్నారు. అయితే   ‘‘ఫండ్స్​ లేవు సార్.. శాంక్షన్ చేసినా పనులు మొదలుపెట్టే పరిస్థితి లేదు” అని ఉన్నతాధికారులు బదులిస్తున్నారు.  ‘‘ఫస్ట్​ అయితే అప్రూవల్​ ఇవ్వండి.. తర్వాత సంగతి తర్వాత చూద్దాం’’ అని ఫైల్స్​ను ఓకే చేయించుకునేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజుల కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆర్​ అండ్​ బీ డిపార్ట్​మెంట్​లో పని ముగించుకుని వస్తూ.. ‘‘మా సొంత ఫైళ్లు అనుకునేరు.. నియోజకవర్గంలో రోడ్లకు సంబంధించినవి.. ఇవి కూడా మేమే పట్టుకుని తిరిగి చేయించుకోవాల్సి వస్తున్నది.. ఎలక్షన్​ ఇయర్​ కదా.. తప్పుతలే’’ అని తనను కలిసిన మీడియాతో అన్నారు. 

ఊర్లల్లో నిలదీతలతోనే..!

ఎన్నికల ఏడాది కావడంతో కొన్నిరోజులుగా ఎమ్మెల్యేలు గ్రామాల బాట పట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఊర్లలో జనాలు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సర్వీస్​ రోడ్లు, ప్రభుత్వ స్కూళ్లలో కొత్త క్లాస్లుల నిర్మాణం, పల్లె దవాఖాన్లు ఇతరత్రా వంటి వాటిపై నిలదీస్తున్నారు. రాష్ట్రంలోని అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో 80 శాతం మందికి ఇదే అనుభవం ఎదురవుతున్నది. ఇదే విషయాలు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్​ రిపోర్ట్​లో ప్రభుత్వానికి చేరుతున్నది. దీంతో తమ మీద వ్యతిరేకత ఎక్కువగా ఉందని తేలితే.. మళ్లీ టికెట్​కు ఇబ్బంది అవుతుందని, నియోజకవర్గంలో కొన్ని పనులన్నా చేయించుకుంటే కొంతలో కొంత ప్రజల నుంచి వ్యతిరేకత తగ్గుతుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఆఫీస్​ల ద్వారా ఫైల్స్​ వెళ్లే ఎప్పుడు ఓకే అవుతాయో తెలియదేని, అసలు అప్రూవల్​ ఇస్తారో ఇవ్వరో కూడా తెలియదని ఎమ్మెల్యేలే ఫాలో ఆప్​ చేసుకుంటున్నారు.