జెడ్పీ మీటింగులంటే జంకుతున్న ఎమ్మెల్యేలు

జెడ్పీ మీటింగులంటే జంకుతున్న ఎమ్మెల్యేలు
  • సమస్యలు, పెండింగ్ స్కీంలపై నిలదీస్తున్న సభ్యులు
  • సర్కారును, లీడర్లను ఇరుకున పెట్టేలా ప్రశ్నలు
  • సమాధానం చెప్పలేక తరచూ మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మా

ఖమ్మం, వెలుగు: జిల్లాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు 3 నెలలకోసారి నిర్వహించే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు ప్రజాప్రతినిధులు తరుచూ డుమ్మా కొడుతున్నారు. ఆఫీసర్ల సాక్షిగా సమస్యలు, పెండింగ్ స్కీములపై సభ్యులు నిలదీస్తుండడంతో సర్ది చెప్పలేక మంత్రులు, ఎమ్మెల్యేలు మీటింగులకు రావడం తగ్గిస్తున్నారు. రూలింగ్ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలే ఒకరి తర్వాత ఒకరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుండడంతో సమాధానాలు చెప్పుకోలేక జిల్లా అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. ఓ పక్క ప్రభుత్వం పల్లె ప్రగతి తర్వాత గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేవని గొప్పలు చెప్తుండగా, మరో పక్క అధికార పార్టీ ప్రజాప్రతినిధులే సర్వసభ్య సమావేశాల్లో సమస్యల చిట్టా విప్పుతుండడంతో ఎమ్మెల్యేలు సమావేశాలకు రాకుండా తప్పించుకుంటున్నారు. జెడ్పీ మీటింగులకు  మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరైతే తాము లేవనెత్తే సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారనే ఆశ ఉండేదని, వాళ్లే డుమ్మా కొడుతుండడంతో సర్వసభ్య సమావేశాలు పెట్టి ఎందుకని సభ్యులు అంటున్నారు.

సమస్యలపై నిలదీతలు.. 
‘‘గ్రామాల్లో  మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు.. పల్లెల్లో పైపులైన్లన్నీ లీకవుతున్నాయి.. ఇంటింటికి ఇస్తామన్న నల్లాలు ఇంకా ఇయ్యలేదు..  ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాం” అని జూలై 19న జరిగిన నారాయణపేట జెడ్పీ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు అడుగుతుంటే వేదికపై ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు ఎస్.రాజేందర్​రెడ్డి, చిట్టెం రాంమ్మోహన్​రెడ్డికి ఎలా సముదాయించాలో అర్థం కాలేదు. ‘‘పోడు భూముల్లో ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలు నాటుతున్నారు.. అడ్డుకుంటున్న రైతులపై కేసులు పెడుతున్నారు.. ఈ సమస్యను ఎప్పటికి పరిష్కరిస్తారు?’ అంటూ జూన్ 30న జరిగిన ఆసిఫాబాద్ జెడ్పీ సమావేశంలో జెడ్పీటీసీలు నిలదీస్తుంటే సమాధానం చెప్పాల్సిన  సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. చివరికి ఇష్యూతో ఏ సంబంధం లేని ఆఫీసర్లపై విరుచుకుపడ్డారు. 

అన్నీ సమస్యలే.. 
జెడ్పీ మీటింగుల్లో సభ్యులు ఎక్కువగా పోడు భూములు, డబుల్ బెడ్రూం ఇండ్లు, మిషన్ భగీరథ నీళ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలపై సర్కారును, ఎమ్మెల్యేలు, మంత్రులను ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా13 లక్షలకు పైగా ఎకరాల్లో పోడు భూముల సమస్య ఉంది. కేంద్రం తెచ్చిన ‘రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్(ఆర్వోఎఫ్ఆర్) యాక్ట్ –2006 ప్రకారం తమకు పట్టాలివ్వాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పోడు భూములపై గిరిజనులకు సాగు హక్కులు కల్పిస్తామని సీఎం ఏడేండ్లుగా చెబుతున్నా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. దీంతో ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, నాగర్‌ కర్నూల్‌వంటి మొత్తం 24 జిల్లాల్లో జరిగే జెడ్పీ మీటింగులలో సభ్యులు ప్రధానంగా పోడు భూముల ఇష్యూపై సర్కారును, ముఖ్యంగా ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. జులైలో కురిసిన వర్షాలకు చాలా గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల బ్రిడ్జిలు, కల్వర్టులు  కూలిపోయాయి. ఆర్అండ్​బీ, పంచాయతీరాజ్​శాఖలు ప్రపోజల్స్ పంపినా ఇంకా ఫండ్స్ రిలీజ్ చేయలేదు. కొత్త రోడ్లు వేయకున్నా కనీసం రిపేర్లు చేయించాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నా సర్కారు నుంచి స్పందన ఉండడం లేదు. ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా మిషన్ భగీరథ కింద ఇప్పటికీ ఇంటింటికీ నీళ్లు ఇవ్వలేకపోతోంది. చాలా గ్రామాల్లో ఇంట్రా పైపులైన్ పనులు కంప్లీట్ కాలేదు. గతేడాది వానాకాలం సీజన్​లో కురిసిన భారీ వర్షాలు, ఆగస్టు, అక్టోబర్ నెలల్లో వచ్చిన వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నట్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు  ప్రభుత్వానికి రిపోర్టు పెట్టారు. ఇందుకు సంబంధించి రూ.188. 23 కోట్లను కేంద్రం రిలీజ్ చేసినా ఇంతవరకు రైతులకు పరిహారం ఇవ్వలేదు.   ఇక చాలా జిల్లాల్లో డబుల్​బెడ్​రూం ఇండ్లు కంప్లీట్​ కాలేదు.  ఏడేండ్లలో 2లక్షల 91వేల 57 ఇండ్లను  ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు 98,978 ఇండ్లను మాత్రమే నిర్మించగలిగింది. వీటిలో 20 శాతం ఇండ్లను  కూడా లబ్ధిదారులకు కేటాయించలేదు. 

ఎమ్మెల్యేలు ఒక్కరూ రాలే..
దాదాపు 8 నెలల తర్వాత ఈ నెల 7న జరిగిన ఖమ్మం జెడ్పీ మీటింగ్​లోనూ సమస్యలపై సభ్యులు ఆఫీసర్లను నిలదీశారు. కొవిడ్ కారణంగా చాలా గ్యాప్ తర్వాత జరిగిన సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్ డుమ్మా కొట్టారు. ఇక మధిర అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొత్త పాలకవర్గం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా ఇంత వరకు ఒక్క మీటింగ్ కు కూడా అటెండ్ కాలేదు. దీంతో జెడ్పీ సభ్యులంతా అధికారులకే సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీల సభ్యులకు మించి అధికార పార్టీకి చెందిన జెడ్పీ సభ్యులే విపక్ష పాత్ర పోషించారు.

పోలికలతో తలనొప్పులు..
ఇటీవల హుజూరాబాద్ కు వందల కోట్లు కేటాయిస్తుండడంతో, దాన్ని ఉదాహరణగా చూపిస్తూ జెడ్పీ మీటింగుల్లో సభ్యులు తమ మండలాలకు కూడా నిధులు ఇవ్వాలని మంత్రులను నిలదీస్తున్నారు. సంగారెడ్డి జెడ్పీ మీటింగ్ లో జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిలతో సభ్యులు సమస్యలు చెప్పుకుంటూ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఒక్క హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ కు రూ.2 వేల కోట్లు ఇచ్చే సీఎం కేసీఆర్ మా మండలాలకు రెండు కోట్లు కూడా ఇస్తలేరని అధికార పార్టీ నేతలే విమర్శలు చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సముదాయించే ప్రయత్నం చేశారు. మిగిలిన జెడ్పీ మీటింగుల్లోనూ అదే పరిస్థితి ఉంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తరచుగా పోడు భూములపై సభ్యులు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. దీంతో పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సమాధానం చెప్పుకోలేక ఫారెస్ట్ ఆఫీసర్లపై మండిపడుతున్నారు. ఇటీవల సూర్యాపేట జెడ్పీ మీటింగ్ లోనూ టీఆర్ఎస్ సభ్యులు సమస్యలపై కలెక్టర్ కు అర్జీలు ఇస్తే పెద్ద కట్టవుతుందని గోడు వెళ్లబోసుకున్నారు. మిషన్ భగీరథ, హరితహారం, పింఛన్లు, వడ్ల కొనుగోళ్లపై సమస్యలను ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీనితో గత రెండు జెడ్పీ సమావేశాలకు మంత్రి జగదీశ్​ రెడ్డి రాకుండా తప్పించుకున్నారు. 

నిజాం సర్కార్ కన్నా ఎక్కువ దౌర్జన్యం చేస్తున్నరు
గతంలో జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పారు. కానీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులను ఫారెస్టు ఆఫీసర్లు అడ్డుకుంటున్నరు. గతంలో నిజాం సర్కార్ హయాంలో శిస్తు కట్టకపోతే ఎలాగైతే దౌర్జన్యం చేసేవారో, ఇప్పుడు అటవీ శాఖ అధికారులు నిజాం సర్కార్ ను మించి దౌర్జన్యం చేస్తున్నారు. విత్తనాలు పెట్టే టైంలో రైతులను ఇబ్బంది పెడుతున్నారు. మేం గవర్నమెంట్ లో ఉండి ఎక్కువగా మాట్లాడలేక పోతున్నం.
‑ ఇటీవల ఆసిఫాబాద్ జెడ్పీ మీటింగ్ లో జడ్పీటీసీ అరిగేల నాగేశ్వరరావు