పంజాగుట్ట, వెలుగు: తమ జీవితకాల కష్టార్జితంతో రిటైర్డ్ ఉద్యోగులు కొనుగోలు చేసిన విష్ణు ప్రియానగర్ సొసైటీ ప్లాట్ల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వీడాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డి కోరారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్లాట్ల యజమానులతో కలిసి ఆయన మాట్లాడారు. అమీన్పూర్ సర్వే నెం. 143లో 93.15 గుంటల భూమిని వీరు న్యాయబద్ధంగా కొనుగోలు చేశారన్నారు.
అయితే గత ప్రభుత్వ హయాంలో చెరువు అలుగును పూడ్చివేసి మినీ ట్యాంక్ బండ్ నిర్మించడంతో బ్యాక్ వాటర్ వచ్చి ఈ ప్లాట్లన్నీ మురికిమయంగా మారాయన్నారు.
అలాగే నిబంధనలకు విరుద్ధంగా సమీపంలోని విల్లాలకు తప్పుడు అనుమతులిచ్చి సొసైటీ సభ్యులకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో హైడ్రా కమిషనర్ స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
