
- స్టూడెంట్స్ మత్తుకు బానిసలవుతున్నరు
- దేశాభివృద్ధికి యువతే కీలకం: నటుడు శివారెడ్డి
- ముగిసిన ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ స్మారక యువజనోత్సవాలు
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. డ్రగ్స్ కారణంగా ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని, స్టూడెంట్స్ గంజాయికి బానిసై బంగారం లాంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలుగు యూనివర్సిటీలో భగత్‌సింగ్ స్మారక యువజనోత్సవాల ముగింపు సభ నిర్వహించారు. దీనికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, సినీ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి చీఫ్ గెస్ట్లుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడారు. ‘‘ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో మేము డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. స్టూడెంట్స్ డ్రగ్స్‌కు బానిస అవుతున్నారు. స్కూల్స్, కాలేజీల్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది’’అని తెలిపారు. భగత్‌సింగ్ ఆశయాలు చాలా గొప్పవని, ఆయన ఆలోచనలను స్టూడెంట్స్ అనుసరించాలని కోరారు. నేటి యువత సోషల్ మీడియాలో మోజులో పడి కుటుంబం, దేశం గురించి ఆలోచించడం లేదని సినీ నటుడు శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆలోచనలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు.