
జమ్మికుంట/హుజూరాబాద్, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన వారికి జైలు జీవితం తప్పదని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హెచ్చరించారు. శుక్రవారం జమ్మికుంట, హుజూరాబాద్ పట్టణాల్లో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తీవ్ర అవినీతి జరిగిందన్నారు.
దళితబంధు, గొర్రెల పంపిణీ లాంటి అనేక పథకాల్లో విచారణ చేశాక బాధ్యులపై చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్ రేసులో అవకతవకలు జరిగినట్లు ఆధారాలున్నాయని, మాజీ మంత్రి కేటీఆర్ జైలుకు పోకతప్పదన్నారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలాటీలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పార్టీలకతీతంగా నిధులు మంజూరు చేసిందని, తాను కొట్లాడి నిధులు తీసుకోవచ్చానని ఇక్కడి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఆయన తీరు మార్చుకోకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించి ప్రజల కష్టాలు తీర్చాలని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. అంతకుముందు హుజూరాబాద్‌లో చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్నారు. అనంతరం జమ్మికుంట హౌజింగ్ బోర్డ్ కాలనీ, గణేశ్‌నగర్, కొత్తపల్లిలోని దుర్గామాత మంటపాల వద్ద అమ్మవారినిదర్శించుకున్నారు.