స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ లేదు: జీవన్ రెడ్డి

  స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ లేదు: జీవన్ రెడ్డి

జగిత్యాల జిల్లా మూలరాంపూర్ అధికార టీఆర్ఎస్ సర్పంచ్ సంతోష్ ఆత్మహత్యపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్సీ నిధుల నుండి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సహకారం లేకపోవడంతో గతంలో బీజేపీలో జాయిన్ అయ్యాడు. అక్కడ కూడా ఆదరణ లేకపోవడంతో మళ్లీ టీఆర్ఎస్ లోకి జాయిన్ అయ్యాడు. ఎన్నికల కోసం చేసిన అప్పులు గుట్టలా పేరుకుపోవడంతో తీర్చే మార్గం కనిపించక చివరికి దిక్కుతోచని స్థితిలో సర్పంచ్ సంతోష్ ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 

దేశాభివృద్ధికి ముఖ్య భూమిక పోషించే స్థానిక సంస్థలపై అధికారుల అజమాయిషీ పెరిగిపోయిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ లేకుండా పోయిందని..అధికారులే పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీ, మున్సిపల్  ఎన్నికలు ఎంతో ఖరీదు అయిపోయాయని తెలిపారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఎన్నికలలో ఖర్చుపెట్టి అప్పుల పాలవుతున్నారని చెప్పారు. చిన్న గ్రామపంచాయతీలకు  ట్రాక్టర్లు అవసరం లేకున్నా బలవంతంగా అంటగడుతున్నారని విమర్శించారు. ట్రాక్టర్ ఈఎంఐ, విద్యుత్ బిల్లులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు.