మెడికల్​ కాలేజీల్లో పూర్తి వైద్య సేవలందించాలి

మెడికల్​ కాలేజీల్లో పూర్తి వైద్య సేవలందించాలి

జగిత్యాల, వెలుగు : మెడికల్​ కాలేజీల ద్వారా పూర్తి వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని  ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.  జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో బుధవారం ఆయన ప్రెస్ మీట్  నిర్వహించి మాట్లాడారు. తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు  సంతోషకరమని అన్నారు. అయితే డయాలసిస్ రోగులకు ఐదు యూనిట్స్ మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉందని, మరో ఐదు యూనిట్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్ మినిస్టర్ హరీశ్​రావు ధర్మపురి, కోరుట్ల ప్రభుత్వ దవాఖానాల్లో డయాలసిస్​ సెంటర్లు ఏర్పాటుకు ఇచ్చిన హామీ మరిచిపోయారన్నారు.  జగిత్యాల జిల్లా దవాఖానాలో  ఆర్థో మినహా ఈఎన్టీ, కంటి సర్జరీలు జరగడం లేదని,  కంటి వెలుగు కింద 2018 కి ముందు గుర్తించిన సర్జరీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేసిన  మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల వాటా ఉందని, కార్మికుల పిల్లలకు రిజర్వేషన్ కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, పీసీసీ సభ్యులు గిరి నాగ భూషణం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్  ఫ్లోర్ లీడర్ కండ్లపల్లి దుర్గయ్య, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్ పాల్గొన్నారు.