విశ్వకర్మలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

విశ్వకర్మలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

విశ్వకర్మలపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 11వ వార్డులో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశ్వ కర్మలపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమ మార్గదర్శకుడు జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర సాధన కోసం ఎంతో పోరాడారని గుర్తు చేశారు.

ప్రొఫెసర్ జయశంకర్ ను ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారిని అగౌరపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడటం బాధాకరం అన్నారు. శ్రీకాంత చారి, ప్రొఫెసర్ జయశంకర్ లు ఒక వర్గానికి మాత్రమే చెందిన వారు కాదని.. తెలంగాణ సమాజానికి చెందినవాని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఉన్నత వర్గాలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుందా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రాముఖ్యతనివ్వాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ సమాజానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.