
కరీంనగర్ జిల్లా: వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం చేయాలన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఆదివారం ఆయన..కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం, కురిక్యాల గ్రామంలోని ఐకేపీ సెంటర్ లో ధాన్యం కొనుగోళ్ళ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవన్ రెడ్డి..విత్తనాలు వెదజల్లే విధానంలో వరి సాగు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. ఇలా చేయడం వల్ల ఎకరాకు 5 క్వింటాళ్ల వరి దిగుబడి తగ్గుతుందన్నారు. దీంతో రాష్ట్ర రైతులు దాదాపు 10 వేల కోట్ల ఆదాయం కోల్పోతారని తెలిపారు. వెదజల్లే విధానంలో సాగు చేస్తే .. రైతుకు 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్న గ్యారెంటీ ప్రభుత్వం ఇస్తుందా ? అంత కంటే తగ్గితే తగ్గిన మొత్తానికి ప్రభుత్వం పరిహారం ఇస్తామని హామీ ఇవ్వాలన్నారు. గతంలోనూ నిర్భంధ సాగుతో రైతు ఎకరానికి పదివేలు నష్టపోయాడని గుర్తు చేశారు. రైతు, రైతు కూలీల అనుబంధం భార్య భర్తల అనుబంధం లాంటిదని..రైతుకూలీ లేనిదే రైతు లేడు అన్నారు.