వరద బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలం

వరద బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలం

జగిత్యాల : భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల పంట నష్టం జరిగినా అంచనాలు రూపొందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. అధికారులు వెంటే క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి నష్ట అంచనాలు సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదించాలని డిమాండ్ చేశారు. దేశంలో విత్తనాల సబ్సిడీ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇంత నష్టం జరిగినా పంట నష్టం జరగలేదని చెప్పడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పంట నష్టపోయిన రైతులకు అటు కేంద్రం నుంచి గానీ ఇటు రాష్ట్రం నుంచి గానీ పరిహారం అందిన దాఖలాలు లేవని మండిపడ్డారు.

పంట నష్టంపై కేంద్రానికి నివేదించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టపోతే చెప్పుకునేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు నామోషీగా ఫీలవుతున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి భేషజాలకు పోకుండా వరద తాకిడికి గురైన చెరువుల పునర్నిర్మాణానికి పంట సాగుకు ఎకరాకు రూ.20 వేలు, ఇసుక మేటలు తొలగింపునకు మరో రూ.10వేల చొప్పున సాయం చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. దిగువ స్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు ఫీల్డ్ విజిట్ కు వెళ్లేలా ఆదేశించాలని సీఎం కేసీఆర్ కు సూచించారు.