50 శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వకూడదని ఎక్కడా లేదు 

50 శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వకూడదని ఎక్కడా లేదు 

కరీంనగర్:  సీఎం కేసీఆర్ గిరిజనులకు కల్పిస్తానన్న 10 శాతం రిజర్వేషన్ కేవలం రాష్ట్ర స్థాయిలోనే వర్తిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దీన్ని అమలు చేసే విషయంలో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అయినా కేసీఆర్ ఇంతకాలం కేంద్రం మీద నెపం వేసి.. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ను  అమలు చేయకుండా జాప్యం చేశారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని గతంలోనూ తాను అసెంబ్లీలో చెప్పానని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. గిరిజన రిజర్వేషన్ అంశాన్ని ముస్లిం రిజర్వేషన్ తో జతచేసి కేసీఆర్ సర్కారు కేంద్రానికి పంపిందన్నారు.

50 శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేనప్పటికీ.. ఎందుకు కేంద్రానికి నివేదించారు? అని ఆయన ప్రశ్నించారు. ‘‘ముస్లిం రిజర్వేషన్ అంశం మాత్రమే కోర్టులో ఉన్నందున.. దానితో లింక్ చేసి గిరిజన రిజర్వేషన్ అంశాన్ని వివాదం చేయకండి’’ అని రాష్ట్ర సర్కారుకు సూచించారు. గత ఏడేళ్లుగా కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే గిరిజనులు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్ కు ఏ విషయమూ పూర్తిగా తెలియదు. తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఎవరైనా చెప్పినా వినడు. పీకల మీదకు వచ్చాక ఇప్పుడు గిరిజనులకు రిజర్వేషన్ అమలు చేస్తా అంటున్నాడు’’ అని వ్యాఖ్యానించారు.  గిరిజన బంధు అంటున్న కేసీఆర్ .. మళ్లీ భూమిలేనివారికే అంటూ కండిషన్ పెడుతున్నారని,  షరతులు లేకుండా గిరిజన బంధు ఇవ్వాలని కోరారు.