గత సంవత్సరం నిధులనే మళ్లీ బడ్జెట్‭లో పెట్టిన్రు: జీవన్ రెడ్డి

గత సంవత్సరం నిధులనే మళ్లీ బడ్జెట్‭లో పెట్టిన్రు: జీవన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు కేంద్రం పై నెపం వేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపులలో సగం నిధులు కూడా ఖర్చు చేస్తారన్న నమ్మకం లేదన్నారు. శాసనసభపై బీఆర్ఎస్‭కు గౌరవం లేదని ఆయన విమర్శించారు. ఈరోజు చర్చ తెలంగాణ బడ్జెట్ పై జరిగిందా.. కేంద్రప్రభుత్వ బడ్జెట్ పై జరిగిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులను క్వారీ ఫార్వార్డ్ పేరుతో దారి మళ్లిస్తున్నారని జీవన్ రెడ్డి అన్నారు. గత సంవత్సరం దళితబంధుకు కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా.. ఈ సారి అదే బడ్జెట్‭ను మళ్ళీ పెట్టారని విమర్శించారు. గిరిజన బంధు మాయమైందని ఆరోపించారు. సొంత ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం చేసే సహాయం ఏదని ప్రశ్నించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని మండిపడ్డారు.  

తూతూ మంత్రంగా సభలు ముగించారు:  భట్టి విక్రమార్క

నెహ్రూ వేసిన పునాదులే ఈ దేశాన్ని దృఢంగా చేశాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బడ్జెట్ సమావేశాలు తూతూమంత్రంగా ముగించేశారని ఆయన విమర్శించారు. కనీసం 28 రోజులు సభ నడపాలని డిమాండ్ చేస్తే.. ఏడు రోజుల్లోనే ముగించేశారని ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యం చెందిందని కేసీఆర్ విమర్శించడం బాధాకరమన్నారు. ఎక్కడ కాంగ్రెస్ విఫలమయిందో కేసీఆర్ సమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. గరిబీ హాఠావో, గ్రీన్ రెవల్యూషన్ , భూ సంస్కరణలు తీసుకొచ్చి కాంగ్రెస్ ఫేలయిందా అని ప్రశ్నించారు. కూలీల కోసం ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి విఫలమయిందా సమాధానం చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ విఫలమైందని శాసనసభలో కేసీఆర్  పదే పదే అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భట్టి విక్రమార్క ఆరోపించారు.