మండలిలో ప్రతిపక్ష నేత ఎవరు? ..రేసులో కవిత, భానుప్రసాద్

మండలిలో  ప్రతిపక్ష నేత ఎవరు? ..రేసులో కవిత, భానుప్రసాద్
  • చారి, సత్యవతి పేర్లు కూడా
  • బీఆర్ఎస్ కు 36 మంది ఎమ్మెల్సీలు
  • త్వరలో తేల్చనున్న గులాబీ బాస్

హైదరాబాద్: శాసన మండలిలో ప్రతిపక్ష నేత  స్థానం ఎవరికి లభిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం 42 మంది సభ్యులకు గాను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు 36 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ కు ముగ్గురు, మజ్లిస్ కు ఇద్దరు, బీజేపీకి ఒక సభ్యుడు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ కు దక్కనుంది. ఈ పోస్టు కోసం నలుగురు ప్రధానంగా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ప్రతిపక్ష నేత హోదా దక్కవచ్చని ఓ వైపు ప్రచారం సాగుతోంది. అయితే ఈ పోస్టును ఆమెకు కేటాయిస్తారా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. 

తెలంగాణ శాసన సభ తొలి స్పీకర్ మధుసూదనాచారి కూడా రేసులో ఉన్నారు. అయితే ఆయనకు ప్రతిపక్ష నేత పదవిని ఇవ్వొద్దని భూపాల పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చెబుతున్నారట. అలా కాదని ఇస్తే తాను కాంగ్రెస్ లో చేరతానంటూ గులాబీ అధినాయకత్వానికి ఏకంగా అల్టిమేటం జారీ చేశారని తెలుస్తోంది.  మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆమె ఇటీవలి కాలంలో మరింత యాక్టివ్ అయ్యారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా  సీనియర్ ఎమ్మెల్సీ భాను ప్రసాదరావు కూడా ప్రతిపక్ష నేత పోస్టు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిలో ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.