ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్

ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్
  • గత మార్చిలో పిటిషన్​ వేసిన కవిత
  • తనపై చర్యలు తీసుకోకుండా దర్యాప్తు సంస్థలకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో దర్యాప్తు సంస్థలు తనపై ఎలాంటి చర్యలు (అరెస్ట్ లాంటివి) తీసుకోకుండా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ స్కాంకు సంబంధించి పలుమార్లు ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన తర్వాత గతేడాది మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె తరఫు అడ్వకేట్ వందన సెఘల్ మొత్తం 105 పేజీలతో రిట్ పిటిషన్ (క్రిమినల్) దాఖలు చేశారు. ఈడీ ఆఫీసుకు మహిళను విచారణకు పిలవొచ్చా? అనే అంశాన్ని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ విచారణ సందర్భంగా.. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పిటిషన్లతో కవిత వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు బెంచ్​ ట్యాగ్ చేసిన విషయం తెలిసిందే. 

గత నెల ఫిబ్రవరి 28న ఈ పిటిషన్లు జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ల బెంచ్ ముందు లిస్ట్ అయ్యాయి. అయితే, ఇతర పిటిషన్లపై విచారణతో సమయం లేకపోవడంతో కవిత పిటిషన్ బెంచ్ ను రీచ్ కాలేదు. దీంతో కవిత తరఫు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ ఆమె పిటిషన్ విషయాన్ని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్​లో ఉండగానే ఈడీ మళ్లీ నోటీసులిచ్చిందని, కావున పిటిషన్​పై త్వరగా విచారణ చేట్టాలని అభ్యర్థించారు. తదుపరి విచారణకు రెండు రావాల టైం కోరారు. ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న బెంచ్.. విచారణకు సమయం లేనందున (మార్చి 13) తర్వాత విచారిస్తామని, ఈలోపు ఇరుపక్షాలు తుది వాదనలకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది.