రెచ్చగొట్టేది బీజేపీ నేతలు..మాది శాంతి పంథా

రెచ్చగొట్టేది బీజేపీ నేతలు..మాది శాంతి పంథా

కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు సామాన్యులకు అందకుండా పెంచేశారన్నారు. పసుపు బోర్డు ఎప్పుడు తెస్తారో రైతులకు సమాధానం చెప్పాలన్నారు.  పసుపు రైతుల ఆత్మగౌరవాన్ని అరవింద్ ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. ఓయూ సభపై విపక్షాలది అనవసర రాద్ధాంతమన్నారు.  వరంగల్ లో జరిగేది రైతు సంఘర్షణ యాత్ర కాదని.. రాహుల్ సంఘర్షణ యాత్ర అని అన్నారు. కేంద్ర బలగాలను చాలా చూసామన్నారు. రెచ్చగొట్టేది బీజేపీ నేతలని..తమది శాంతి పంథానన్నారు. తమ మీద దాడి చేస్తే ఉరుకుంటామా? అని ప్రశ్నించారు.వరి కొనుగోలుపై పార్లమెంటులో లేవనెత్తాలని.. తెలంగాణ రైతులను ఆదుకోవాలని తాము రాహుల్ గాంధీని  కోరినా స్పందించలేదన్నారు. ఇప్పుడు వరంగల్‌లో రాజకీయాలు చేయడానికి ఇక్కడకు వస్తున్నారన్నారు.

బాండ్ పేపర్ రాసిచ్చి రైతులను అర్వింద్ మోసం చేశారన్నారు. పసుపు బోర్డు ఎప్పుడు తెస్తారో చెప్పాలన్నారు. మూడేళ్ళలో  1.92 కోట్లు  ఎంపీ తెచ్చారని..అవి ఇక్కడి రైతులకు కనీసం చాయ్ పైసలు కూడా సరిపోవన్నారు.పసుపు రైతులను సాంగ్లీ కి వెళ్లాలని ఎంపీ చెప్పడం ఏంటని ప్రశ్నించారు.  ఏం చేయకుండా చేసినట్టు చెప్పడం బీజేపీకి అలవాటయ్యిందన్నారు. రాజనాథ్ సింగ్, రాం మాధవ్ నుంచి నిజామాబాద్ ఎంపీ అర్వింద్ వరకు అందరూ మూడేళ్ళుగా అబద్ధాలే చెబుతున్నారన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, కేంద్రం చేస్తున్న పనులు చూడాలన్నారు.

అంతకు ముందు నిజామాబాద్ నగరంలోని ఖిల్లా రామాలయాన్ని కవిత సందర్శించారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ టెంపుల్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఆమె వెంట టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి ఉన్నారు.