
- రైతు బంధు కింద ఎకరం ఉంటే 10 వేలు.. 10 ఎకరాలుంటే లక్ష ఇచ్చినం
- పదేండ్లలో భూమి లేని కార్మికులకు ఏమీ చేయలేకపోయినం
- తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య తేడాలున్నయ్
- రంగారెడ్డిలో 8 లక్షలుంటే.. వికారాబాద్లో లక్షన్నరేనా?
- ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరమని వ్యాఖ్య
- మే 20 నాటి సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ప్రకటన
హైదరాబాద్, వెలుగు: భౌగోళిక తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ.. సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం చేసే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎవరిని పడితే వారిని ఎత్తుకెళ్లి కాల్చి చంపే అత్యంత క్రూరమైన ఇటలీ నియంత ముస్సోలినీ, జర్మనీ నియంత హిట్లర్ మీద పోరాడినట్టే.. రేపటి తెలంగాణలో సమ సమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సామాజిక తెలంగాణ దిశగా భవిష్యత్తు అడుగులు పడాలని కవిత అన్నారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన మే డే వేడుకల్లో పాల్గొన్న కవిత మాట్లాడుతూ.. మే డే స్ఫూర్తితో రాష్ట్రంలో అసమానతలు తొలగిపోవడానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. “తెలంగాణ లో తలసరి ఆదాయంలో చాలా తేడాలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 8 లక్షలు ఉంటే.. వికారాబాద్ లో రూ. లక్షా 58వేలు మాత్రమే.
పది కిలోమీటర్ల దూరంలోనే ఇంత వ్యత్యాసం ఉండడం ప్రమాదకరం. అసమానతలు తొలగిపోవడానికి మే డే స్ఫూర్తి కావాలి. రైతు బంధు కింద ఎకరం ఉంటే పది వేలు.. పది ఎకరాలుంటే లక్ష రూపాయలు ఇచ్చినం. కానీ భూమి లేని కార్మికులకు పదేండ్లలో ఏమీ చేయలేకపోయాం. భవిష్యత్తులో భూమి ఉన్నా.. లేకున్నా ఎలా ఆదుకోవాలనే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలి” అని వ్యాఖ్యానించారు.
కార్పొరేట్ కు కొమ్ముకాసే చట్టాలు తెచ్చారు
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఆదర్శవంతమైన లేబర్ చట్టాలు ఉండేవని, కానీ, ఇప్పుడు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసేలా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారని కవిత అన్నారు. “కార్మికుల శ్రమను దోచుకొనేందుకే ఈ చట్టాలను తెచ్చారు. ఈ చట్టాలు పోయి.. కార్మికులకు మేలు చేసే చట్టాలు వచ్చేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మే 20 న దేశ వ్యాప్తంగా చేసే కార్మికుల సమ్మెకు సంపూర్ణ మద్దతిస్తున్నాం.
లేబర్ కోడ్ కావొచ్చు.. ఇంకోటి కావొచ్చు.. హక్కులను పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశంలో ఇంకా ఎన్నో అసమానతలు ఉన్నాయి. మహిళలు, పురుషులకు సమాన వేతనం కలగానే మిగిలింది. ఒకే పని చేయించుకుంటున్నా మహిళలకు తక్కువ జీతాలు ఇస్తున్నారు. తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా ఈ అసమానతలు పోవాలి” అని కవిత అన్నారు.