
హైదరాబాద్: వీకెండ్లో కూల్చివేతలు చేపట్టొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా.. వాటిని అమలు చేయకుండా శని, ఆది వారాల్లో కూల్చివేతలు చేపట్టడం ఏంటని హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. గాజుల రామారంలో పేదల ఇల్లు కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. పండగ పూట పేదల జీవితాల్లో చీకట్లు నింపడం ఈ ప్రభుత్వానికి అలవాటు అయిందని మండిపడ్డారు.
మీకు దమ్ముంటే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని సవాల్ విసిరారు. గాజుల రామారంలో బాధితులకు కనీసం ముందస్తు సూచనలు చేయకుండా, కట్టుబట్టలతో బయటకు పంపి ఇండ్లు కూల్చడం హేయమైన చర్యని విమర్శించారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా.. బాధితులకు వేరే చోట వసతి ఏర్పాటు చేసిన తర్వాత ఆక్రమణలు తొలగించాలన్నారు.
పేదలను రోడ్డున పడేసి కూల్చివేతలు చేపడితే హైడ్రా జేసీబీలకు తానే అడ్డం పడతానని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చాక అక్రమణలు తొలగించాలని కోరారు. లేదంటే పేదల పక్షాన జాగృతి తరపున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆదివారం (సెప్టెంబర్ 21) గాజుల రామారంలోని ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే