
- కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి: జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
- ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి
- నాది రాజకీయ పోరాటం కాదు.. బీసీల ఆత్మగౌరవ పోరాటం
- గాంధీ మార్గంలోనే 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని వెల్లడి
- ఇందిరా పార్క్ వద్ద ధర్నా
ముషీరాబాద్, వెలుగు: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అందరికీ రాజ్యాధికారంలో వాటా దక్కాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలని పట్టుబట్టారు. తనది రాజకీయ పోరాటం కాదని.. బీసీల ఆత్మగౌరవ పోరాటమని.. గాంధీ చెప్పిన అహింసా మార్గంలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తామని స్పష్టం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో సోమవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆమె 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నేత అర్జున్ సింగ్ చౌతాలా, మాజీ ఉప ప్రధాని దేవీలాల్ మునిమనుమడు అర్జున్ హాజరై మద్దతు తెలిపారు.
అయితే, 72 గంటలు కొనసాగాల్సిన దీక్షకు హైకోర్టు పర్మిషన్ లేకపోవడం, పోలీసులు ముగించాలని కోరడం.. మరోపక్క జోరుగా వర్షం కురుస్తుండడంతో సోమవారం సాయంత్రానికే కవిత దీక్షను విరమించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీలకు హక్కులు వచ్చాకే 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల కోసం తమిళనాడులో తొమ్మిదేండ్లపాటు స్థానిక ఎన్నికలు జరగలేదని, ఆ రాష్ట్రం పట్టు పట్టడంతోనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమయ్యాయన్నారు.
కానీ, మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నెపాన్ని నెట్టి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదని, మరోపక్క రిజర్వేషన్లు రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమని బీజేపీ చెప్పడం ఏంటని ఆమె విమర్శించారు. బీసీ, ముస్లిం రిజర్వేషన్లను వేర్వేరుగా చూడాలని, ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లకు ప్రత్యేక బిల్లు పెడతామన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అవసరమైతే ఢిల్లీ జంతర్ మంతర్‌లో దీక్ష
తెలంగాణలో ధర్నా చౌక్ ను ఓపెన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో గప్పాలు కొడుతున్నారని.. కానీ, జాగృతి 72 గంటల దీక్షకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. హైకోర్టు పర్మిషన్ కోసం పోలీసులను అడిగితే 8వ తేదీ నుంచి దీక్ష చేసుకోమని కోర్టుకు చెప్పారని తెలిపారు. కోర్టులను ధిక్కరించే పరిస్థితి లేదని, కోర్టుల పట్ల గౌరవం ఉంచి దీక్షను ముగిస్తున్నానన్నారు. కానీ, తమ పోరాటం వివిధ రూపాల్లో కొనసాగుతుందని, అవసరమైతే ఢిల్లీ జంతర్ మంతర్‌లోనూ దీక్ష చేస్తామని హెచ్చరించారు. జాగృతి పోరాటాలతోనే బీసీ రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీకి వచ్చిందని, సావిత్రిబాయి పూలే జయంతిని ఉమెన్స్ టీచర్స్ డే గా ప్రకటించారని కవిత డిమాండ్చేశారు. జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేస్తే.. ట్యాంక్ బండ్ పై నెలకొల్పారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ విగ్రహం కోసం 42 గంటలు దీక్ష చేశానని చెప్పారు.
అలాగే, పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో కేసీఆర్ పేరును 36 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అది కాంగ్రెస్ పార్టీ కమిషన్ అని తాము ధర్నా చౌక్ వేదికగానే ఎత్తిచూపామన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కమిషన్ నివేదిక పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు నిర్మాణాలు జరిగాయని తెలిపారు. ప్రాజెక్టులో అత్యధిక టెండర్లు దక్కించుకున్న మేఘా కృష్ణా రెడ్డిని ఎందుకు విచారించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
కవిత పోరాటానికి అండగా ఉంటాం: అర్జున్ సింగ్ చౌతాలా
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేయడం మానుకోవాలని.. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఇండియన్ నేషనల్ లోకల్ నేత అర్జున్ సింగ్ చౌతాలా డిమాండ్ చేశారు. దేశంలో వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో పెకిలించాలని అన్నారు. కవిత ఒక న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతున్నారని, ఆమె పోరాటానికి ఢిల్లీలో అయినా హైదరాబాద్ లో అయినా అండగా ఉంటామని చౌతాలా స్పష్టం చేశారు.