బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత.. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలి: ఎమ్మెల్సీ కవిత

బీజేపీ డీఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత.. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం ఆమోదించాలి: ఎమ్మెల్సీ కవిత
  • రైల్ రోకో ట్రైలర్ మాత్రమే.. డెక్కన్ నుంచి ఢిల్లీకి ఒక్క రైలూ రాదు
  • మద్దతు కోసం బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలకు లేఖలు రాస్తానని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: బీజేపీ డీఎన్​ఏలోనే బీసీ వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్​ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఓబీసీని అని చెప్పుకునే ప్రధాని మోదీకి ఆ వర్గాలకు న్యాయం చేసే చాన్స్ వచ్చిందని, తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన చారిత్రకమైన బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

గిరిజన బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బీసీ బిల్లుకు ఆమోదం తెలిపితే చరిత్రలో నిలిచిపోతారని, ఈ బిల్లుపై ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ లో మీడియాతో  కవిత మాట్లాడారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు న్యాయం జరగాలంటే తక్షణమే బీసీ బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలన్నారు. లేదంటే ఈ నెల 17న జాగృతి నేతృత్వంలో తలపెట్టిన రైల్ రోకోలో ఒక్క రైలురను కూడా ముందుకు కదలనివ్వబోమని హెచ్చరించారు. ఈ రైల్ రోకో కేవలం ట్రైలర్ మాత్రమేనని.. డెక్కన్ నుంచి ఢిల్లీకి రైళ్లను రానిచ్చే ప్రసక్తే లేదన్నారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు బీజేపీ కృషి చేయాలని, అప్పుడే ఆ పార్టీని ప్రజలు విశ్వసిస్తారని చెప్పారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యమాలు తెలంగాణ వాళ్లకు కొత్తేమీ కాదని, ఆ విషయం కేంద్రంలోని బీజేపీ సర్కార్  గుర్తుంచుకోవాలన్నారు. రైల్ రోకోకు మద్దతు కోసం బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలకు లేఖలు రాస్తామని తెలిపారు.  

అసెంబ్లీలో ఆమోదించగానే సరిపోదు..

అసెంబ్లీలో బీసీ బిల్లులను ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపగానే తమ పని పూర్తయిందని కాంగ్రెస్ సర్కారు చెప్పుకుంటే సరిపోదని కవిత అన్నారు. కేంద్రం ఆ బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చే వరకు పోరాడాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం చేస్తామని రాజ్యాంగాన్ని పట్టుకుని రాహుల్ దేశమంతా తిరగటం కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (డీ) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే జీవో జారీ చేసి పెంచిన రిజర్వేషన్లను అమలు చేసే వెసులు బాటు ఉందని తెలుసుకోవాలన్నారు. 

రేవంత్ రెడ్డి ఎలాగూ ఢిల్లీలోనే ఉన్నారని, రాహుల్ గాంధీ పిలిపించుకుని బీసీ రిజర్వేషన్లకు జీవో ఇప్పించి పంపించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి పోటీలో ఉండదని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే ఉంటారని క్లారిటీ ఇచ్చారు. ఓబీసీ నేతలకు పార్టీలో పదవుల కేటాయింపునకు సంబంధించి బీఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగొద్దని  కవిత అన్నారు. పార్టీలో పదవులు కొందరికే లబ్ధి చేకూర్చుతాయని, రిజర్వేషన్లు అమలైతే మొత్తం ఓబీసీ లకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.