కోర్టు తీర్పు తర్వాతే మీ దగ్గరకు వస్తా: కవిత

కోర్టు తీర్పు తర్వాతే  మీ దగ్గరకు వస్తా: కవిత

నిజామాబాద్ టూర్ ను అర్దాంతరంగా ముగించుకొని హైదరాబాద్ చేరుకోనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. కాసేపట్లో ఆమె సీఎం క్యాంప్ ఆఫీస్ కు వెళ్తారని తెలుస్తోంది. అక్కడే లీగల్ అడ్వైజర్లతో భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే కవిత తన తరపున లాయర్లను ఢిల్లీకి పంపారు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణ తర్వాత ఈడీ విచారణకు హాజరుతానని అడ్వకేట్ తో ఈడీ అధికారులకు సమాచారం పంపినట్టు తెలుస్తోంది. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ నోటీసులపై సుప్రీం కోర్టులో  కవిత వేసిన పిటిషన్  కాసేపట్లో   విచారించనుంది జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం. ఈడీ తనకు జారీ చేసిన సమన్లు రద్దు చేయాలని ధర్మాసనంను కోరారు కవిత. తనపై ఈడీ ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు కవిత. సుప్రీంలో కవిత రపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.

లిక్కర్ స్కాం కేసులో ఈడీ సెప్టెంబర్ 14న కవితకు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న విచారణకు రావాలని ఆదేశించింది.  హైదరాబాద్ లోని కవిత ఇంటికి నోటీసులు పంపగా..మెయిల్ ద్వారా మరో సెట్ నోటీసులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. కవితను ఈడీ అధికారులు ఇప్పటికే మూడు సార్లు విచారించారు. మార్చి 16, 20, 21 తేదీల్లో మూడు సార్లు విచారించింది ఈడీ.