సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కొత్త డ్రామాలు: బండి సంజయ్

సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కొత్త డ్రామాలు: బండి సంజయ్
  • తప్పించుకునేందుకు డ్రామాలు మొదలుపెట్టిన్రు: సంజయ్ 
  • డ్రగ్స్ కేసులతోనూ కేసీఆర్ ఫ్యామిలీకి లింక్ 
  • సర్కార్ను కూల్చాల్సిన అవసరం మాకేంటి? 

 

నిర్మల్, వెలుగు: ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అరెస్టు చేస్తదని భయం పట్టుకుందని, అందుకే విచారణకు హాజరు కావడం లేదంటూ చెప్పారని బీజేపీ స్టేట్ చీఫ్ సంజయ్ అన్నారు. ‘‘లక్ష కోట్లతో లిక్కర్ దందా చేసిన సీఎం కేసీఆర్ బిడ్డ కవిత.. సీబీఐ విచారణకు హాజరైతే తనను అరెస్టు చేస్తారని భయపడుతోంది. అందుకే తండ్రీబిడ్డ ప్రగతి భవన్​లో కూర్చొని ఏడుస్తున్నారు. సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కొత్త డ్రామాలు మొదలు పెట్టారు. అరెస్టు అయితే సానుభూతి కోసం స్కెచ్ వేస్తున్నారు. తెలంగాణ సెంటిమెంట్​ను రగిలించే కుట్ర చేస్తున్నారు” అని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో కవిత ప్రమేయం లేకపోతే 10 ఫోన్లను ఎందుకు ధ్వంసం ఈ ప్రశ్నించారు. ఈడీ, ఐటీ లాంటి దర్యాప్తు సంస్థలు ఎక్కడ దాడులు చేసినా కవిత పేరే ఎందుకు బయటకు వస్తోందని అడిగారు. సోమవారం నిర్మల్ జిల్లాలో సంజయ్ పాదయాత్ర చేశారు. లక్ష్మణ్ చందా మండలం కనకాపూర్, మామడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మాట్లాడారు. డ్రగ్స్ కేసులతోనూ కేసీఆర్ కుటుంబానికి లింకు ఉందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసులను రీఓపెన్ చేసి, విచారణ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్‌కు దమ్ముంటే డ్రగ్స్, క్యాసినో, లిక్కర్ కేసుల్లో విచారణకు హాజరై తమ నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ చేశారు. 

దోచుకున్నదంతా కక్కిస్తం.. 

రాష్ట్రాన్ని టీఆర్ఎస్ లీడర్లు దోచుకుంటున్నారని సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం సహా మంత్రులు, లీడర్లు చేసిన అవినీతి, అక్రమాలు, భూకబ్జాల లిస్టు తన దగ్గర ఉందని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే దోచుకున్నదంతా కక్కిస్తామని తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా పేదలను హింసించిన భూకబ్జాదారులను, అవినీతిపరులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ‘‘బాపురావు తన ఆస్తులను ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఇంద్రకరణ్ రెడ్డి తన ఆస్తులను రాసిస్తడా?” అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందన్న కేసీఆర్ కామెంట్లపై మండిపడ్డారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలి. కానీ మాకు కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి? తెలంగాణ ప్రజల ఆశలను కూల్చిందే కేసీఆర్. ప్రతిపక్ష పార్టీకి చెందిన 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని కూల్చిందే కేసీఆర్. తెలంగాణ ప్రజలే ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారు” అని అన్నారు. 

ఇచ్చిన హామీలు ఏమైనయ్? 

కేసీఆర్​కు అమరవీరులు ఇప్పుడు గుర్తుకువచ్చారా? అని సంజయ్ ప్రశ్నించారు. 1,400 మంది ఆత్మబలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ రాజ్యమేలుతున్నారని ఫైర్ అయ్యారు. నాలుగేండ్లయినా కొండగట్టు మృతుల కుటుంబాలకు ఉద్యోగం, పరిహారం ఏమైందన్నారు. ‘‘రాష్ట్రానికి 2.40 లక్షల ఇండ్లను ప్రధాని మోడీ మంజూరు చేశారు. డబుల్ బెడ్రూమ్​ ఇండ్ల నిర్మాణానికి రూ.4 వేల కోట్లు ఇచ్చారు. రైతన్నలకు సబ్సిడీపై ఎరువులను ఇస్తున్న మోడీ గొప్పోడా? సబ్సిడీలను బంజేసిన కేసీఆర్ గొప్పోడా?” అని ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ ఇప్పటికే 5 లక్షల కోట్ల అప్పు చేసిండు. మళ్లీ గెలిపిస్తే మరో 5 లక్షల కోట్ల అప్పు చేస్తడు. అవినీతి పాలనకు ముగింపు పలకాలి” అని ప్రజలకు పిలపునిచ్చారు. ఎంపీ సోయం బాపూరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

16న పాదయాత్ర ముగింపు సభ.. చీఫ్‌‌ గెస్ట్‌‌గా నడ్డా

హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ ఐదో విడత పాదయాత్ర ఈ నెల 16న ముగియనుంది. ఈ సందర్భంగా నిర్వహించనున్న ముగింపు సభకు పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా ముఖ్య​అతిథిగా హాజరుకానున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న పాదయాత్ర ముగియాల్సి ఉంది. ఈ సందర్భంగా కరీంనగర్ ఎస్‌ఆర్‌‌ఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో ముగింపు సభను ఏర్పాటు చేసి, జాతీయ ముఖ్య నేత ఒకరిని ఆహ్వానించాలని రాష్ట్ర పార్టీ అనుకుంది. అయితే, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల హాడావుడి నెలకొనడంతో పార్టీ చీఫ్ నడ్డానే ఈ సభకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని భావించింది. ఈ విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లగా, ఈ నెల 16న మాత్రమే నడ్డా షెడ్యూల్‌ ఖాళీగా ఉందని సమాచారం ఇచ్చింది. దీంతో ఈ యాత్రను అనుకున్న షెడ్యూల్ కన్నా ఒక రోజు ముందే ముగించాలని రాష్ట్ర నాయకులు నిర్ణయించారు. అయితే, రూట్ మ్యాప్‌లో ఎలాంటి మార్పులు లేవని యాత్ర ఇన్‌చార్జి మనోహర్ రెడ్డి సోమవారం మీడియాకు తెలిపారు. రోజు నడిచే కిలో మీటర్ల సంఖ్యను మాత్రమే పెంచామన్నారు.