
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆమె తన చిన్న కొడుకు ఆర్యను గ్రాడ్యుయేషన్ కోసం కాలేజీలో చేర్పించేందుకు శనివారం (ఆగస్ట్ 16) ఉదయం అమెరికాకు బయలుదేరారు. పెద్ద కుమారుడు ఆదిత్య, చిన్న కొడుకు ఆర్యతో కలిసి అమెరికా వెళ్లిన కవిత 15 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవిత భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు ఆమెకు సెండాఫ్ ఇచ్చారు. 2025, సెప్టెంబర్ 1న కవిత తిరిగి హైదరాబాద్కు రానున్నారు.
కాగా, ఉన్నత చదువుల కోసం కుమారుడిని అమెరికాకు పంపే ముందు కవిత ఆమె తండ్రి కేసీఆర్ను కలిశారు. ఈ మేరకు శుక్రవారం (ఆగస్ట్ 15) ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్లిన కవిత తన కుమారుడికి తాత కేసీఆర్ ఆశీర్వాదం ఇప్పించారు. కవిత గతంలో అమెరికాకు వెళ్లిన సమయంలోనే ఆమె తన తండ్రి కేసీఆర్కు రాసిన లేఖ లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ లేఖ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో ఈ సారి కవిత అమెరికా పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దానిపై ఆసక్తి నెలకొంది.