
- కోవర్టులను పక్కకు పెడ్తేనే బీఆర్ఎస్కు మనుగడ
- తండ్రికి బిడ్డగా నేను రాసిన లేఖ ఎట్ల బయటకొచ్చింది?
- దాని వెనుక ఎవరున్నారో ఆలోచించాలి
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్
- అమెరికా నుంచి రాక.. ఘన స్వాగతం పలికిన జాగృతి కార్యకర్తలు
- ‘కాబోయే సీఎం’ అంటూ నినాదాలు.. ప్లకార్డుల్లో కనిపించని కేసీఆర్ ఫొటో
హైదరాబాద్, వెలుగు: తన తండ్రి కేసీఆర్కు రెండు వారాల కింద తానే లేఖ రాశానని, దాన్ని ఎవరు లీక్ చేశారో తేలాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని, వారివల్లే చాలా నష్టం జరుగుతున్నదని పేర్కొన్నారు. తాను రాసిన లేఖకే ప్రైవసీ లేకుంటే పార్టీలోని ఇతరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘అది డాడీకి నేను అంతర్గతంగా రాసిన లేఖ. ఆ లేఖనే బయటకు లీక్ చేశారంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దేవుడు.. కానీ, ఆయన చుట్టూ కొన్ని దయ్యాలున్నయ్. పార్టీలోని కోవర్టులను పక్కకు పెడ్తేనే పార్టీ మనుగడ సాధ్యమవుతుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. తన కుమారుడు గ్రాడ్యుయేషన్ డే ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన కవిత.. శుక్రవారం హైదరాబాద్కు తిరిగి వచ్చారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్దే మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు తాను రాసిన లేఖపై క్లారిటీ ఇచ్చారు. ‘‘డాడీకి నేనే లేఖ రాశాను. కుట్రలు.. కుతంత్రాలు జరుగుతున్నాయని వివరించాను. పార్టీకి సంబంధించిన పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చాను. గతంలో కూడా ఇలా లేఖ రాశాను. రాస్తాను” అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో చిన్న చిన్న లోపాలున్నాయని, వాటిని సరిచేసుకోవాలన్నారు. ‘‘పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పాను. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమా లేదు. కేసీఆరే మా నాయకుడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. లేఖ లీక్ కావడంతో కాంగ్రెస్, బీజేపీ కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు సంబురపడుతున్నట్టున్నయ్. ఆ రెండు పార్టీలూ రాష్ట్రాన్ని ఫెయిల్ చేసినయ్. కేసీఆర్ నాయకత్వంలోనే మళ్లీ తెలంగాణ బాగుపడతది’’ అని కవిత పేర్కొన్నారు.
‘కాబోయే సీఎం’ అంటూ కార్యకర్తల నినాదాలు
కవిత హైదరాబాద్ తిరిగి వస్తుండడంతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వందలాదిగా జాగృతి కార్యకర్తలు తరలివచ్చారు. ‘‘కాబోయే సీఎం కవిత నాయకత్వం వర్ధిల్లాలి’’ అంటూ నినాదాలు చేశారు. కవిత వెంట తరుచూ కనిపించే బీఆర్ఎస్ నేతలెవరూ ఎయిర్పోర్టు వద్దకు రాలేదు. ఇటు కవితకు స్వాగతం చెప్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో బీఆర్ఎస్ పార్టీ పేరు, కేసీఆర్ పేరు కనిపించలేదు. ఫ్లెక్సీల్లో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీశ్ రావు ఫొటోలనూ పెట్టలేదు. మొత్తం జాగృతి కార్యకర్తలతో ఎయిర్పోర్టు ప్రాంగణం నిండిపోయింది. కార్యకర్తలు బ్లూ, గ్రీన్ కలర్ కండువాలతో అక్కడికి వచ్చారు. ‘‘టీమ్ కవితక్క’’ అంటూ కటౌట్లు ప్రదర్శించారు. ‘‘సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న కవితకు స్వాగతం’’ అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.