బీసీ రిజర్వేషన్లు తేల్చండి : ఎమ్మెల్సీ కవిత

బీసీ రిజర్వేషన్లు తేల్చండి : ఎమ్మెల్సీ కవిత
  • కేసీఆర్​ను కలవకపోవడంపై ఇప్పుడేం మాట్లాడను: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్​, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగానే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

బీజేవైఎం నాయకుడు సాయినాథ్ తో పలు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు, విద్యార్థులు శనివారం కవిత నివాసంలో ఆమె సమక్షంలో జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థులు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిల్లాడుతున్నారని విమర్శించారు. దర్శనాల సంగతి పక్కనబెట్టి ప్రజా సమస్యలపై సీఎం దృష్టిపెట్టాలని సూచించారు. 

కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని, రొటీన్ చెకప్​లలో భాగంగానే ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారని ఆమె తెలిపారు. కేసీఆర్​ కాళేశ్వరం కమిషన్​ విచారణ సందర్భంగా ఫాంహౌస్​కు వెళ్లినా కేసీఆర్​ను కలవకపోవడంపై ప్రశ్నించగా.. దానిపై ఇప్పుడేం మాట్లాడనంటూ ఆమె సమాధానం దాటవేశారు. కేటీఆర్​ తమ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కాబట్టే.. ఏసీబీ నోటీసులపై స్పందించానన్నారు.