ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే.. BRS నేతలు ఎప్పటికైనా నా దారికి రావాల్సిందే: కవిత

ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే.. BRS నేతలు ఎప్పటికైనా నా దారికి రావాల్సిందే: కవిత

హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల అంశంపై ఎమ్మెల్సీ కవిత  మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం (జూలై 17) బంజారాహిల్స్‎లోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో కవిత చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసం పంచాయతీ రాజ్ చట్టం 2018ని సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం కరెక్టేనని రేవంత్ సర్కార్ నిర్ణయానికి మద్దతు పలికారు. 

ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ పార్టీ చెప్పడం తప్పని సొంత పార్టీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. నిపుణులతో చర్చించాకే ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‎కు మద్దతు ఇచ్చా.. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా నా దారికి రావాల్సిందే.. నాలుగు రోజులు టైం తీసుకుంటారేమో అంతేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కవిత. 2018 పంచాతీయ రాజ్ చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబేనని అన్నారు.  

తీన్మార్ మల్లన్న ఎవరో నాకు తెల్వదు:

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ పార్టీ స్పందించకపోవడంపైన కవిత రియాక్ట్ అయ్యారు. తీన్మార్ మల్లన్న నాపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదు. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను జనాభా లెక్కలోనుంచి తీసేశానని.. ఆయన ఎవరో నాకు తెలియదన్నారు కవిత. కాగా, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, కవిత మధ్య వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. 

కవితతో మాకు కంచం పొత్తు ఉందా మంచం పొత్తు ఉందా అంటూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి నేతలు భగ్గుమన్నారు. మల్లన్న వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వెళ్లి ఆయనపై దాడికి యత్నించారు. మల్లన్నను జాగృతి కార్యకర్తల నుంచి కాపాడే క్రమంలో ఆయన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ నాటకీయ పరిణామాల అనంతరం కవిత, మల్లన్న మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.