అధికారం పోయాక రైతులు గుర్తొచ్చారా? : ఎమ్మెల్సీ మహేశ్‌‌ కుమార్ గౌడ్

అధికారం పోయాక రైతులు గుర్తొచ్చారా? : ఎమ్మెల్సీ మహేశ్‌‌ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: అధికారం పోయిన తర్వాత కేసీఆర్‌‌‌‌కు ఇప్పుడు రైతులు గుర్తొచ్చారా అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌‌ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కరువు, వరదలు వచ్చి తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆయన ఏనాడైనా పరామర్శించారా? అని నిలదీశారు. కేసీఆర్ పొలం బాట పేరుతో రైతుల వద్దకు వెళ్తుంటే చాలా విచిత్రంగా ఉందని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు.

వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థ యాత్రలకు పోయిన చందంగా కేసీఆర్ పొలం బాట కార్యక్రమం ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వరి వేస్తే ఉరి వేసినట్టే అని భయపెట్టిన కేసీఆర్.. ఏ ముఖం పెట్టుకొని పంటలను పరిశీలిస్తున్నారని మండిపడ్డారు. కరువుకు కారణం కాంగ్రెస్ అని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు.