నమస్తే తెలంగాణపై చర్యలు తీసుకోండి : మహేశ్​ కుమార్ గౌడ్

నమస్తే తెలంగాణపై చర్యలు తీసుకోండి : మహేశ్​ కుమార్ గౌడ్
  •     పోలీసులను కోరిన ఎమ్మెల్సీ మహేశ్​కుమార్ గౌడ్ 
  •     చంద్రబాబు, రేవంత్ భేటీ అయినట్టు అసత్య కథనం ప్రచురించారని ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: బేగంపేట ఎయిర్​పోర్ట్​లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని ‘ నమస్తే తెలంగాణ’ దినపత్రికలో అవాస్తవ కథనం ప్రచురించారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్​ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ వార్తపై శనివారం ఆయన బేగంపేట ఎస్​హెచ్​వోకు ఫిర్యాదు చేశారు. పత్రిక యజమాని దీవకొండ దామోదర్ రావు, ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తిని విచారించి, వాస్తవాలు తెలుసుకోవాలని పోలీ సులను ఆయన కోరారు. 

నిత్యం సీఎం రేవంత్​పై కల్పితాలు, అవాస్తవాలు ప్రచురిస్తూ పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానుల్లో గందరగోళం సృష్టిస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. శుక్రవారం  మధ్యాహ్నం బేగంపేట ఎయిర్​పోర్ట్ లాంజ్​లో చంద్రబాబు, రేవంత్ 2 గంటల పాటు భేటీ అయ్యారని, ఏపీ ఎన్నికలకు తనకు ఆర్థికంగా సహాయం చేయాలని రేవంత్ ను బాబు కోరినట్లు వార్త పబ్లిష్ చేశారని ఫిర్యాదులో మహేశ్​ గౌడ్ పేర్కొన్నారు. ఎయిర్​పోర్ట్ ఆఫీసర్ల నుంచి పూర్తి సమాచారం తీసుకున్నామని, శుక్రవారం చంద్రబాబు  2.45 గంటలకు వచ్చి 3.0 7 గంటలకు వెళ్లారని, సీఎం రేవంత్ రెడ్డి 3 గంటలకు వచ్చి 3.37 గంటలకు మెడికవర్ హాస్పిటల్ కు బయల్దేరారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు చెందిన ‘నమస్తే తెలంగాణ’ పేపర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు పబ్లిష్ చేస్తూ జనాల్లో వారి పార్టీకి సానుభూతి రావాలని ప్రయత్నిస్తున్నదని గుర్తుచేశారు.