కేసీఆర్ తర్వాత ఈటల మాత్రమే..

కేసీఆర్ తర్వాత ఈటల మాత్రమే..

సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన కన్నతల్లి లాంటి పార్టీ మీద ఈటల అనుచిత వ్యాఖ్యలు చేశారని పల్లా అన్నారు. ఏ మాత్రం నాయకత్వ లక్షణాలు, రాజకీయ అవగాహన లేకున్నా కూడా ఈటలను సీఎం కేసీఆర్ అక్కున చేర్చుకుని.. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని పల్లా అన్నారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ‘కేసీఆర్ ఈటలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. పార్టీలో కేసీఆర్ తర్వాత అన్ని పదవులు అనుభవించింది ఈటల మాత్రమే. తప్పులు కప్పిపుచ్చుకోవడానికే ఈటల ఆత్మగౌరవ నినాదం ముందుకు తీసుకొస్తున్నారు. ఈటలకు ఆస్తుల మీద మాత్రమే గౌరవం. ఈటల వెనుక హుజురాబాద్ నాయకులు గానీ, పార్టీ కార్యకర్తలు గానీ, ప్రజాస్వామ్యవాదులు గానీ, బహుజనవాదులు గానీ, వామపక్షవాదులు గానీ లేరు. ఈటల వెనుక ఉన్నది కేవలం కొంతమంది అసంతృప్తులు, ఆస్తుల రక్షణ కోసం చూసే వాళ్లు మాత్రమే. ఈటలవి అవగాహనలేని మాటలు. రైతుబంధు ద్వారా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. మోడీ కూడా ఈ పథకాన్ని వేరే రూపంలో అమలు చేస్తున్నారు. రైతుబంధు పథకాన్ని నీతి ఆయోగ్, యూఎన్ఓ కూడా ప్రశంసించాయి. దేశంలో తెలంగాణ మాత్రమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంది. పథకాల గురించి అవగాహనలేకుండా ఈటల మాట్లాడటం సరికాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారుల గురించి మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీ మంత్రిత్వ శాఖలోని కొంతమంది అధికారులు సహకరించడం లేదని చెప్పి.. ఓ ఎస్సీ అధికారిని మార్పించుకున్న విషయం మరచిపోయారా? తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు.. మీరు చెప్పే విషయాలు ఎవరూ పట్టించుకోరు’ అని పల్లా అన్నారు.