టీచర్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి

టీచర్లకు సర్వీస్ రూల్స్ అమలు చేయాలి : ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
  • ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్

హైదరాబాద్, వెలుగు: టీచర్లకు 2018 పీఓ ప్రకారం.. సర్వీస్ రూల్స్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం పీఆర్టీయూ స్టేట్ ఆఫీసులో తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీటీజేఏసీ) సమావేశం కమిటీ చైర్మన్ పుల్గం దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా శ్రీపాల్ రెడ్డి హాజరై, మాట్లాడారు. సర్వీస్ రూల్స్ లేకపోవడంతో 634 ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 20 ఏండ్లుగా పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. 

ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, డీఏ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అన్ని గురుకులాల్లో టైమ్ టేబుల్ మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇస్తామన్న నెలవారిగా చెల్లించే పెండింగ్ బిల్లులను రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంచాలని శ్రీపాల్ రెడ్డి కోరారు. సమావేశంలో పీఆర్టీయూ రాష్ట్రప్రధాన కార్యదర్శి బిక్షంగౌడ్, వివిధ సంఘాల నేతలు కటకం రమేశ్, రాజ్​గంగారెడ్డి, గిరిధర్ గౌడ్, అబ్దుల్లా, రాఘవరెడ్డి, కృష్ణమూర్తి, జగదీశ్, రమేశ్, దిలీప్ పాల్గొన్నారు.