- ఎన్సీటీఈ చైర్మన్, కేంద్ర మంత్రికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) క్వాలిఫై కావాలనే నిబంధన నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. సోమవారం ఢిల్లీలో పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్ తో కలిసి శ్రీపాల్ రెడ్డి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ విద్యామండలి (ఎన్సీటీఈ) చైర్మన్ పంకజ్ అరోరాకు వేర్వేరుగా వినతిపత్రం అందించారు.
సుప్రీంకోర్టు తీర్పు నుంచి సీనియర్ టీచర్లకు రక్షణ కల్పించాలంటే విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని కోరారు. ఎప్పుడో ఉద్యోగంలో చేరిన టీచర్లకు ఇప్పుడు పరీక్ష పెట్టడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, దీనిపై కిషన్ రెడ్డి, పంకజ్ అరోరా సానుకూలంగా స్పందించారని శ్రీపాల్ రెడ్డి చెప్పారు.
