అసెంబ్లీ టికెట్ల కోసం.. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ గండం

అసెంబ్లీ టికెట్ల కోసం..  ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ గండం
  • ఉమ్మడి జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య ‘పవర్‌’వార్‌
  • అసెంబ్లీ టికెట్‌‌ కోసం ప్రయత్నాలు చేస్తున్న ఎమ్మెల్సీలు
  • జనగామ, స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌ బరిలో పల్లా, కడియం 
  • వరంగల్‌‌ తూర్పుపై బస్వరాజ్ సారయ్య, భూపాలపల్లిపై మధుసూదనాచారి ఆశ
  • అవకాశం కోసం ఎదురుచూపుల్లో పోచంపల్లి

వరంగల్‍, వెలుగు : ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాలోని అధికార పార్టీ సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలకు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీలతో తలనొప్పులు తప్పడం లేదు. ఎన్నికలు దగ్గరపడుతుండడం, అసెంబ్లీ టికెట్ల కోసం ఎమ్మెల్సీలు సైతం పోటీకి వస్తుండడంతో ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాల్లో బీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేలు ఉండగా, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్సీల్లో ఒకరిద్దరు తప్పించి మిగతా వారంతా ఈ సారి అసెంబ్లీ టిక్కెట్‌‌ కోసం ఆశ పడుతున్నారు. ఇందులో ఇద్దరు, ముగ్గురికి ఇప్పటికే లైన్‌‌ క్లియర్‌‌ కాగా, మరో ఇద్దరు తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఓరుగల్లులో ముగ్గురి నుంచి నలుగురు సిట్టింగ్‌‌లను మార్చాలని చూస్తున్న హైకమాండ్‌‌ వారి ప్లేస్‌‌లో ఎమ్మెల్సీలకు ఛాన్స్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

జనగామ, స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌లో పల్లా, కడియం 

జనగామ, స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌ సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలకు హకమాండ్‌‌ ఝలక్‌‌ ఇవ్వనున్నట్లు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్థానంలో పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌లో తాటికొండ రాజయ్య స్థానంలో కడియం శ్రీహరిలకు హైకమాండ్‌‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ముత్తిరెడ్డి వర్గంలోని కొందరు లీడర్లు పల్లాకు డైరెక్ట్‌‌గా మద్దతు పలుకుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌కు కూడా లీడర్లు హాజరుకావడం, ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆయనకు ఈ సారి టికెట్‌‌ కష్టమేనని తెలుస్తోంది. ఇక స్టేషన్‌‌ఘన్‌‌పూర్‌‌లో కడియం శ్రీహరి విస్తృతంగా పర్యటిస్తున్నారు. శుక్రవారం జరిగిన మీటింగ్‌‌లో సైతం క్యాండిడేట్ల మార్పు జరిగే నియోజకవర్గాల్లో ఘన్‌‌పూర్‌‌ ఒకటంటూ స్పష్టం చేశారు. 

మూడు నియోజకవర్గాల్లో అంటీముట్టనట్లుగా...

ఉమ్మడి జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌‌రెడ్డి పేరు మొదట్లో పరకాల, ఆ తర్వాత జనగామ నుంచి వినపడింది. జనగామలో పల్లా తెర మీదకు రావడంతో పోచంపల్లి డిసప్పాయింట్‌‌ అయ్యారు. పరకాల నియోజకవర్గంలోని నడికుడ మండలానికి చెందిన పోచంపల్లి ఈ సారి చల్లాకు అనుకూలంగా పనిచేసే పరిస్థితులు కనిపించడం లేదు. భూపాలపల్లిలో సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికే టికెట్‌‌ కన్ఫర్మ్‌‌ అయినట్లు తెలుస్తుండడంతో ఎమ్మెల్సీ మధుసూదనాచారి వర్గం గుర్రుగా ఉంది.

టిక్కెట్‍ కేటాయింపులో ఏ క్షణంలోనైనా ఏమైనా జరగొచ్చని భావిస్తున్నారు. ఇక మహబూబాబాద్‌‌ నియోజకవర్గం ఎస్టీ రిజర్డ్వ్‌‌ అయినా సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే శంకర్‌‌నాయక్‌‌ తీరుతో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌‌రావు దూరదూరంగా ఉంటున్నారు. ఉమ్మడి వరంగల్‌‌కు చెందిన 8 మంది ఎమ్మెల్సీల్లో శాసన మండలి వైస్‌‌ చైర్మన్‌‌ బండా ప్రకాశ్‌‌ తప్పితే మిగతా వారంతా సిట్టింగ్‌‌లతో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. 

రెండు చోట్ల నువ్వా నేనా..

ప్రస్తుతం గిరిజనాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌‌ ఈ సారి ఎమ్మెల్యే అవ్వడమే టార్గెట్‌‌గా పెట్టుకొని అడుగులు వేస్తున్నారు. డోర్నకల్‍పై ముందు నుంచి దృష్టి పెట్టడంతో పాటు తానే బరిలో ఉంటానని పలుమార్లు చెప్పారు. ఒకవేళ డోర్నకల్‌‌లో అవకాశం దక్కకపోతే మహబూబాబాద్‌‌ సీటును ఆశిస్తున్నారు. వరంగల్‌ తూర్పులో సైతం సిట్టింగ్‌‌ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌‌ మార్పు అనివార్యమని తెలుస్తోంది.

మార్పు తప్పనిసరి అయితే ఇక్కడి నుంచి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో పాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సారయ్యకు సర్వేల్లో మంచి మార్కులే ఉన్నా ఎలక్షన్‌‌ ఖర్చు విషయంలో పూర్తిగా పార్టీ మీదే ఆధారపడుతారన్న ప్రచారం ఉంది.