‘లోకల్ సర్కిల్స్’ రిపోర్టులో వెల్లడి
‘మీకు లాటరీలో కోటి రూపాయలు వచ్చాయి. లాటరీ సొమ్ము అందుకోవాలంటే మమ్మల్ని సంప్రదించండి’.. ‘క్రెడిట్ కార్డు కావాలా? అయితే మాకు ఫోన్ చేయండి’.. ‘ఆన్ లైన్ రమ్మీ ఆడండి, డబ్బు గెలుచుకోండి’.. ‘మా కోచింగ్ సెంటర్ లో చేరండి, ఐఏఎస్ అయిపోండి’.. ‘రూపాయి కట్టండి, 10 లక్షల ఇన్సూరెన్స్ పొందండి’…పొద్దు పొడించింది మొదలు, అర్ధరాత్రి వరకు మన ఫోన్లకు వచ్చే స్పామ్ మెసేజ్ ల్లో ఇవి కొన్ని. ఒక్కరికో ఇద్దరికో కాదు.. దేశంలోని 96 శాతం మందికి రోజూ ఇలాంటి అన్ వాంటెడ్ మెసేజ్ లు వస్తున్నాయట. ‘లోకల్ సర్కిల్స్’ అనే ఆన్ లైన్ కమ్యూనిటీ ప్లాట్ ఫాం ఈ విషయాన్ని తెలిపింది. దేశంలోని 12 వేల మందిపై సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్న వారిలో కనీసం సగం మందికి రోజూ 4 నుంచి ఏడు మేసేజ్ లు వస్తున్నాయని చెప్పింది. స్పామింగ్ లో సర్వీస్ ప్రొవైడర్లు బిజీ యూజర్ల ప్రైవసీని కాపాడాల్సిన టెలికామ్ కంపెనీలు.. స్పామింగ్ లో బిజీగా ఉన్నాయని ‘లో కల్ సర్కిల్స్’ చెప్పింది.
ఇదే విషయాన్ని యూజర్లు కూడా చెబుతున్నారు. తాము ఉపయోగిస్తున్న టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్లే తమకు స్పామ్ మెసేజీలు పంపుతున్నాయని సర్వేలో పాల్గొన్న 50 శాతం మంది చెప్పారు. స్పామ్ మెసేజ్ లు ఎక్కువగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందినవే వస్తున్నాయి. తర్వాత బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఆఫర్లకు సంబంధించినవి ఉన్నాయి. దీంతో టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జరిమానాలు విధించింది. అయినా వాటి తీరు మాత్రం మారలేదు.
