ఎనిమిదేండ్ల పిల్లలకూ మొబైల్స్

ఎనిమిదేండ్ల పిల్లలకూ మొబైల్స్
  • 24 శాతం పిల్లలు ఫోన్లు చూస్తూ నిద్రపోతున్నరు
  • ఫోన్ల యూసేజ్​తో ఏకాగ్రత లోపం, కోపం, చిరాకు సమస్యలు
  • రాష్ట్రంలో 41% మంది పిల్లలకు సోషల్​ నెట్​వర్కింగ్ అకౌంట్స్
  • వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ వాడే వాళ్లే ఎక్కువ
  • ఎస్​సీపీసీఆర్ సర్వేలో ఆసక్తికర విషయాలు

హైదరాబాద్​, వెలుగు: పిల్లలు పుట్టిన ఆర్నెల్లు, ఏడాది నుంచే సెల్​ఫోన్లకు అలవాటు పడుతున్నరు. వారు ఏడిస్తే ఊకుంచాలన్నా.. అన్నం తినాలన్నా.. వాళ్ల చేతికి స్మార్ట్​ ఫోన్​ ఇయ్యాల్సిందే. జింగిల్స్, కార్టూన్​ వీడియోలు పెట్టకపోతే ఒక్క బుక్క కూడా మింగని పరిస్థితి నెలకొంది. కరోనా ఎఫెక్ట్​తో మొదలైన ఆన్​లైన్​ క్లాసులు పిల్లలకు మొబైల్స్ ను​ మరింత దగ్గర చేశాయి. ఎనిమిదేండ్ల వయసున్న పిల్లలకే సొంతంగా స్మార్ట్​ఫోన్లు ఉంటున్నాయని నేషనల్​ కమిషనర్ ​ఫర్ ​ప్రొటెక్టింగ్ ​చైల్డ్​ రైట్స్(ఎన్​సీపీసీఆర్) సర్వే తెలిపింది. ఎనిమిదేండ్ల వయసున్న19 శాతం మంది, 8 నుంచి-18 ఏండ్ల వయసున్న 30.2 శాతం మంది పిల్లలకు సొంతంగా ఫోన్లు ఉన్నాయని ఎన్​సీపీసీఆర్​సర్వేలో తేలింది. 

ఏకాగ్రత సమస్యలు..
డబ్ల్యూహెచ్​వో నిబంధనల ప్రకారం పిల్లలు ఒక రోజులో రెండు గంటలకు మించి సెల్​ఫోన్లు వాడకూడదు. కానీ చాలా మంది పిల్లలు అంతకన్నా ఎక్కువ సమయమే ఫోన్లో ఉంటున్నారు. ఆన్​లైన్​ క్లాసుల పేరిట కొన్ని గంటలు, ఎంటర్​టైన్​మెంట్​ పేరిట మరికొన్ని గంటలు సెల్​ఫోన్లలో గడిపేస్తున్నారు. ఎన్​సీపీసీఆర్​ సర్వే ప్రకారం 24% మంది పిల్లలు స్మార్ట్​ఫోన్​ చూస్తూ నిద్రపోతున్నట్లు తేలింది. 37.15% మంది పిల్లలు నిత్యం ఫోన్లు వాడుతూ.. ఏకాగ్రత, జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. పరిమితికి మించిన స్క్రీన్​ టైమ్​తో పిల్లల్లో కోపం, చిరాకు బాగా పెరుగుతాయని డాక్టర్లు అంటున్నారు. అయితే, స్మార్ట్​ఫోన్లతో తమలో క్రియేటివిటీ బాగా పెరిగిందని 31.50 శాతం పిల్లలు సర్వేలో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. 

వాట్సాప్, ఇన్​స్టా, ఫేస్​బుక్..
30 శాతం పిల్లలు తమ సొంత ఫోన్లనే ఆన్​లైన్​ క్లాసులు, ఇతర ఎంటర్​టైన్​మెంట్​ కోసం వాడుతుంటే 62.6 శాతం పిల్లలు వారి పేరెంట్స్​ ఫోన్లు యూజ్​ చేస్తున్నారు. ఇందులో 95 శాతం పిల్లలు తాము ఆన్​లైన్​ క్లాసుల కోసమే సెల్​ఫోన్లు వాడుతున్నామని చెబుతున్నా, తమకు ఇష్టమైన ఫీచర్​ ‘చాటింగ్’​ అని అంటున్నారు. చాటింగ్​ యాప్​లైన వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​లతోపాటు మరికొన్నింటిని పిల్లలు బాగా వాడుతున్నారు. ఎన్​సీపీసీఆర్​ దేశంలోని వివిధ పట్టణాల్లో చేసిన సర్వేలో తెలంగాణ కూడా ఉంది. హైదరాబాద్​లో కొందరు పిల్లల నుంచి తమ సర్వేలో భాగంగా అభిప్రాయాలు సేకరించారు. మొబైల్​లో తమకు చాటింగ్​ ఇష్టమని 52.9 శాతం పిల్లలు చెబితే, 44.10 శాతం మంది మ్యూజిక్​, 31.9 శాతం గేమింగ్​ ఫీచర్లు ఇష్టమని చెప్పారు. కాగా 10.1 శాతం మంది పిల్లలే తాము స్మార్ట్​ఫోన్లను ఆన్​లైన్​ క్లాసులు, స్టడీ మెటీరియల్​ కోసం వాడటానికి ఇష్టపడుతున్నట్లు తెలిపారు.

సోషల్​ నెట్ ​వర్కింగ్ ​అకౌంట్స్
సెల్​ఫోన్​ అల్టిమేట్​ ఎంటర్​టైన్​మెంట్​ డివైజ్​ అని చెబుతున్న పిల్లల్లో 42.90 శాతం మందికి తమ సొంత సోషల్​ నెట్​వర్కింగ్​ అకౌంట్లు ఉంటున్నాయి. ఇందులో 36.8 శాతం మందికి ఫేస్​బుక్​, 45.50 శాతం మందికి ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్లు ఉన్నాయి. తెలంగాణలో 41.30 శాతం పిల్లలకు వివిధ ప్లాట్​ఫామ్​లలో తమ సొంత అకౌంట్లు ఉన్నాయి. పదేండ్ల వయసు పిల్లల్లో 62.1% పిల్లలు సొంత అకౌంట్లు ఉన్నాయని చెప్పడం గమనార్హం. వాస్తవానికి సోషల్​ మీడియా కంపెనీలు13 ఏళ్లు నిండిన వారికి మాత్రమే సొంత అకౌంట్లు క్రియేట్​ చేసుకునే అవకాశం కల్పించాలి. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎక్కువ సేపు స్మార్ట్​ఫోన్ వాడడం వల్ల మానసికమైన సమస్యలతోపాటు సోషల్​ డెవలప్​మెంట్​ సమస్యలు కూడా వస్తున్నాయని పేర్కొంది. సోషల్​ మీడియా ద్వారా సైబర్​ నేరాలు జరుగుతున్నందున పిల్లలు తెలిసీ తెలియక అందులో చిక్కుకునే ప్రమాదం ఉందంటోంది. అందుకే పిల్లలకు సెల్​ఫోన్​ ఇవ్వడంతోపాటు దాన్ని ఎలా వాడాలో నేర్పించాలని పేరెంట్స్​, టీచర్స్​కి సూచించింది. తమ చుట్టుపక్కల ప్లే గ్రౌండ్​లు అందుబాటులోకి తెచ్చి పిల్లలను స్మార్ట్​ఫోన్​ అడిక్షన్​ నుంచి దూరం చేయాలని సూచించింది. ఎయిమ్స్​ బిహేవియరల్​ అడిక్షన్​​ క్లినిక్​ తరహాలో దేశంలో అక్కడక్కడా ఇంటర్నెట్​ డీఅడిక్షన్​ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఎన్​సీపీసీఆర్​ రికమండ్​ చేసింది.