ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిండుకుండల్లా ప్రాజెక్టులు

 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నిండుకుండల్లా ప్రాజెక్టులు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది చోట్ల మినహా అన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వానలే కురుస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదుల్లో నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తోంది. నిర్మల్ జిల్లాలోని కడం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. ప్రస్తుతం 678.9 అడుగుల నీరు ఉంది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో త్వరగానే ప్రాజెక్టు పూర్తిగా నిండుతుందన్నారు అధికారులు. 
రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కొమ్రుంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం అడ ప్రాజెక్టు లోకి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు 3 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ఇన్ ఫ్లో 8 వేల 800 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5 వేల 512 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 మీటర్లు  కాగా, ప్రస్తుతం 241 మీటర్ల నీరు ఉంది.