
‘చింతన్ శివిర్’లో ప్రతిపాదించిన ప్రధాని మోడీ
పోలీసులందరికీ ఒకే యూనిఫామ్ ఉండాలనేది నా సూచన. ఇలానే ఉండాలని నేను రాష్ట్రాలపై ఒత్తిడి తేవాలని అనుకోవడం లేదు. ఒక్క సారి ఆలోచించండి. ఐదేండ్లు.. 50 ఏండ్లు లేదా 100 ఏండ్లలో ఇది జరగవచ్చు. దేశవ్యాప్తంగా పోలీసుల ఐడెంటిటీ సమానంగా ఉండాలని భావిస్తున్న. ఇలా చేయడం వల్ల లా ఎన్ఫోర్స్‌మెంట్ సిబ్బందికి ఉమ్మడి ఐడెంటిటీ వస్తుంది. ఆయా రాష్ట్రాలు తమ చిహ్నాలు, నంబర్లు పెట్టుకోవచ్చు. గన్నులు కావచ్చు.. పెన్నులు కావచ్చు.. నక్సలిజం ఏ రూపంలో ఉన్నా సరే..
మంచిది కాదు. దేశ యువతను తప్పుదోవ పట్టించకుండా అడ్డుకోవాలి. దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ పటేల్ స్ఫూర్తితో పని చేయాలి. మన దేశంలో అలాంటి శక్తులు విజృంభించకుండా అడ్డుకోవాలి.
‑ ప్రధాని నరేంద్ర మోడీ
సూరజ్‌కుండ్ (హర్యానా): దేశంలోని పోలీసులందరికీ ఒకే యూనిఫామ్ ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. ‘వన్ నేషన్.. వన్ యూనిఫామ్’ను ఆయన ప్రతిపాదించారు. ‘‘పోలీసులందరికీ ఒకే యూనిఫామ్ ఉండాలనేది నా సూచన మాత్రమే. ఇలానే ఉండాలని నేను రాష్ట్రాలపై రుద్దాలని ప్రయత్నించడం లేదు. ఒక్క సారి ఆలోచించండి. ఐదేండ్లు.. 50 ఏండ్లు లేదా 100 ఏండ్లలో ఇది జరగొచ్చు.. ” అని చెప్పారు. దేశవ్యాప్తంగా పోలీసుల ఐడెంటిటీ సమానంగా ఉండాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇలా చేయడం వల్ల దేశవ్యాప్తంగా లా ఎన్ఫోర్స్‌మెంట్ సిబ్బందికి ఉమ్మడి ఐడెంటిటీ వస్తుందన్నారు. ఆయా రాష్ట్రాలు తమ చిహ్నాలు, నంబర్లు పెట్టుకోవచ్చని అన్నారు. రాష్ట్రాల హోం మంత్రులతో శుక్రవారం నిర్వహించిన చింతన్ శివిర్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు.
పాత చట్టాలను రివ్యూ చేయండి
పాత చట్టాలపై రివ్యూ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను మోడీ కోరారు. లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ విషయంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అన్ని ఏజెన్సీలతో కలిసి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పాత చట్టాలను సవరించాలని సూచించారు. రాజ్యాంగం ప్రకారం లా అండ్ ఆర్డర్ రాష్ట్రాల సబ్జెక్ట్ అని, ఇదే సమయంలో దేశం ఐక్యత, సమగ్రతతో సమానంగా ముడిపడి ఉందని అన్నారు. ప్రతి రాష్ట్రం ఇంకో రాష్ట్రాన్ని చూసి నేర్చుకోవాలని, దేశ సమగ్రత కోసం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మంచి ఫలితాలు సాధించేందుకు కేంద్ర, రాష్ట్రాల ఏజెన్సీలు పరస్పర సహకారించుకోవాలన్నారు. లా అండ్ ఆర్డర్ అనేది అభివృద్ధితో ముడిపడి ఉంటుందని, శాంతిని కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. దేశ బలం పెరిగితే.. ప్రతి పౌరుడి బలం పెరుగుతుందని అన్నారు. లా అండ్ ఆర్డర్ సిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు కొన్నేండ్లుగా పలు సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి వేదిక
టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండేలా ఉమ్మడి ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చే విషయంపై ఆలోచించాలని ప్రధాని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పోలీస్ టెక్నాలజీ మిషన్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఒక రాష్ట్రం వద్ద ఉన్న మెరుగైన టెక్నాలజీని ఇంకో రాష్ట్రంతో పంచుకోవచ్చన్నారు. ఫేక్ న్యూస్ వ్యాప్తి విషయంలో ఫ్యాక్ట్ చెక్ చాలా ముఖ్యమని, ఈ విషయంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి లా అండ్ ఆర్డర్ సిస్టమ్‌ను మెరుగుపరుచుకోవాలని, శాంతి భద్రతలను కాపాడటమనేది 24/7 చేయాల్సిన పని అన్నారు. నేర ప్రపంచం గ్లోబలైజ్ అయిందని, నేరస్థుల కంటే మనం పది అడుగులు ముందుండాలని చెప్పారు.
గన్నులైనా.. పెన్నులైనా..
యువతను టెర్రరిజం వైపు ఆకర్షించేందుకు, రాబోయే తరాల మనసులను తప్పుదోవ పట్టించేందుకు తమ పరిధిని పెంచుకుంటున్న శక్తుల గురించి ప్రధాని మోడీ హెచ్చరించారు. ‘‘గన్నులు కావచ్చు.. పెన్నులు కావచ్చు.. నక్సలిజం ఏ రూపంలో ఉన్నా సరే.. మంచిది కాదు. దేశ యువతను తప్పుదోవ పట్టించకుండా అడ్డుకోవాలి. దేశ ఐక్యత, సమగ్రత కోసం సర్దార్ పటేల్ స్ఫూర్తితో పని చేయాలి. మన దేశంలో అలాంటి శక్తులు విజృంభించ కుండా అడ్డుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ఇలాంటి శక్తులకు అంతర్జాతీయంగా సాయం అందుతున్నదని చెప్పారు.