మోదీ కాంప్రమైజ్డ్‌‌‌‌‌‌‌‌ పీఎం.. ఇండియన్లను ఆయనేం కాపాడ్తరు?

మోదీ కాంప్రమైజ్డ్‌‌‌‌‌‌‌‌ పీఎం.. ఇండియన్లను ఆయనేం కాపాడ్తరు?
  • రాహుల్ విమర్శలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలపై అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు (సీఫేరర్స్) మరణించడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌‌‌‌‌‌‌‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ‘కాంప్రమైజ్డ్‌‌‌‌‌‌‌‌ పీఎం’గా అభివర్ణించారు.

 భారతీయుల ప్రాణాలు తీసిన వారిని ఎదిరించే ధైర్యం గానీ, బలం గానీ మోదీకి లేవని, అందుకే ఆయన ‘భారత మాత ముద్దుబిడ్డలను’ రక్షించలేకపోతున్నారని దుయ్యబట్టారు. ఈ అంశంపై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ శుక్రవారం ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌’లో పోస్ట్ చేశారు. ‘‘అంతర్జాతీయ జలాల్లో మూడ్రోజుల వ్యవధిలో మూడు షిప్‌‌‌‌‌‌‌‌లపై అమెరికా జరిపిన దాడుల్లో ముగ్గురు ఇండియన్లు ప్రాణాలు కోల్పోయారు. కానీ మన కాంప్రమైజ్డ్‌‌‌‌‌‌‌‌ పీఎం దీనిపై ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.

 ఒక విదేశీ శక్తి భారతీయుడిని హత్య చేసినప్పుడు ప్రధాని కచ్చితంగా స్పందించాలి’’ అని రాహుల్ డిమాండ్ చేశారు. వచ్చే వారం జరగనున్న జీ7 సదస్సుకు మోదీ వెళ్తున్నారని, అక్కడ నవ్వుతూ, కౌగిలించుకుంటూ, ఒప్పందాలపై సంతకాలు చేస్తారని, కానీ ప్రాణాలు కోల్పోయిన ఆ ముగ్గురు ఇండియన్ల కోసం మాట్లాడటానికి ఆయనకు సమయం ఉండదని విమర్శించారు. ప్రాణాలు తీసిన శక్తులను ప్రశ్నించే ధైర్యం లేని పీఎం దేశాన్ని రక్షించలేరని రాహుల్‌‌‌‌‌‌‌‌ వ్యాఖ్యానించారు.