న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన వేళ కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మోడీ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. మోడీ ప్రభుత్వం అభద్రతా భావంతో విదేశీ ప్రముఖులు ప్రతిపక్షాలను కలవడానికి అనుమతించడం లేదని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘సాధారణంగా విదేశీ నేతలు, విదేశీ బృందాలు భారత పర్యటనకు వచ్చినప్పుడు వాళ్లు ప్రతిపక్ష నేతలను కలవడం సంప్రదాయం. అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్ కాలంలో ఇలా జరిగేది. కానీ మోడీ ప్రభుత్వం, విదేశాంగ శాఖ ఇలాంటి సంప్రదాయాలను తుంగలో తొక్కుతోంది. భారత పర్యటనకు వచ్చే విదేశీ ప్రముఖులకు ప్రతిపక్ష నేతలను కలవద్దని ప్రభుత్వం చెబుతోంది. ఇది వారి విధానం. ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు’’ అని మోడీ సర్కార్‌పై రాహుల్ మండిపడ్డారు.
మోడీ ప్రభుత్వం అభద్రత కారణంగా ప్రతిపక్ష నేతలను విదేశీ ప్రముఖులతో కలవనివ్వడం లేదని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రతిపక్ష నేతలను కలవడం, సమావేశాలు నిర్వహించడం సందర్శించే ప్రతినిధి బృందంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాయి.
ఇండియాకు వచ్చిన విదేశీ ప్రముఖులతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు గుర్తు చేశాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం, మారిషస్ ప్రధాన మంత్రి నవీనచంద్ర రామగూలం, న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ వంటి విదేశీ ప్రముఖులతో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ కలిశారని కౌంటర్ ఇచ్చాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.
