కేంద్రం కీలక నిర్ణయం.. పాక్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ పౌరులకు భారత పౌరసత్వం

కేంద్రం కీలక నిర్ణయం..  పాక్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ పౌరులకు భారత పౌరసత్వం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలను వెల్లడించింది కేంద్రం.  ఈ బిల్లు 2019 డిసెంబర్‌లోనే పార్లమెంటు ఆమోదం పొందినా నిరసనల కారణంగా అమలవలేదు. ఎన్నికలకు ముందే దీన్ని అమలు చేస్తామని హోంమంత్రి అమిత్ షా ఇటీవలే తెలిపారు. ఈ చట్టం పాక్, ఆఫ్గన్, బంగ్లాదేశ్‌ల నుంచి 2015సం.లోపు దేశంలోకి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇస్తుంది. 

ఆయా దేశాలకు చెందిన ఆరు వర్గాల్లో హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం లభించనున్నది. కేంద్రం 2019 డిసెంబర్‌ 11న పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదించింది. 2014 డిసెంబర్‌ 31 అంతకన్నా ముందుకు పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన వారికి మాత్రమే చట్టం వర్తిస్తుంది. కాగా పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తామని 2019 ఎన్ని్కల మేనిఫెస్టోలో  బీజేపీ ప్రకటించింది. 

పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌కు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం పౌరసత్వ సవరణ చట్టం CAA) ఉద్దేశం. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసి 2019లో చట్టంగా మార్చింది. అయితే పౌరసత్వం ఇచ్చేందుకు మతాన్ని ప్రాతిపదికగా తీసుకోవడం దేశంలో ఇదే తొలిసారి. దీంతో ఈ సీఏఏ వివాదాస్పదంగా మారింది. దీన్ని తాము అమలు చేయమని కేరళ, తమిళనాడు రాష్ట్రాలు చెబుతున్నాయి.