ఇండియా, గ్రీస్ మధ్య.. వాణిజ్యం రెట్టింపు చేస్తాం : మోదీ

ఇండియా, గ్రీస్ మధ్య.. వాణిజ్యం రెట్టింపు చేస్తాం :  మోదీ
  • ఫార్మా, డిఫెన్స్​లో కలిసి ముందుకెళ్తాం: మోదీ
  • ఉగ్రవాదంపై పోరాటం ఆగదు
  • స్కిల్ మైగ్రేషన్​పై ఒప్పందం చేసుకుంటాం
  • గ్రీస్ పర్యటనలో భాగంగా ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని

ఏథెన్స్‌‌‌‌: ఇండియా, గ్రీస్ దేశాల మధ్య 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ట్రేడ్, ఇన్వెస్ట్​మెంట్స్, డిఫెన్స్, సెక్యూరిటీ, టెక్నాలజీ, ఇన్​ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, డిజిటల్ పేమెంట్స్, ఫార్మా, టూరిజం, అగ్రికల్చర్​తో పాటు మరికొన్ని రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా సౌతాఫ్రికా వెళ్లిన మోదీ.. సమిట్ ముగించుకుని శుక్రవారం గ్రీస్ చేరుకున్నారు. ఆ దేశ రాజధాని ఏథెన్స్‌‌లో దిగిన ఆయనకు అక్కడి విదేశాంగ మంత్రి జార్జ్‌‌ గెరా పెట్రైటిస్‌‌ స్వాగతం పలికారు.  సింటాగ్మా స్క్వేర్​లోని ఓల్డ్ రాయల్ ప్యాలెస్ ముందు ఉన్న ‘ది టోంబ్ ఆఫ్ ది అన్నోన్ సోల్జర్’ వార్ మెమోరియల్​ను మోదీ సందర్శించి గ్రీకు సైనికులకు నివాళులర్పించారు.

సహకారం మరింత పెంపొందిస్తాం..

గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సో టాకీస్‌‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. రక్షణ పారిశ్రామిక సహకారాన్ని మరింత పెంపొందించేందుకు అంగీకరించామన్నారు. కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామని తెలిపారు. ఇండియా, గ్రీస్ మధ్య స్కిల్ మైగ్రేషన్ సులభతరం చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని నిర్ణయించామన్నారు. ఇండియాతో తమ సంబంధాలు చాలా మెరుగుపడ్డాయని, రెండు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ, పర్యాటక రంగాల్లో విస్తృత సహకారానికి అవకాశం ఉందని గ్రీస్‌‌ ప్రధాని మిత్సోటాకిస్ అన్నారు.1983, సెప్టెంబర్​లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ గ్రీస్​లో పర్యటించారు. దాదాపు 40 ఏండ్ల తర్వాత భారత ప్రధాని గ్రీస్​లో అడుగుపెట్టారు.

గ్రీస్ ప్రెసిడెంట్​తోనూ మోదీ భేటీ

అంతకుముందు గ్రీస్ ప్రెసిడెంట్ కాటెరినా ఎన్ సకెల్లా రోపౌలౌతోనూ మోదీ భేటీ అయ్యారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంపై మోదీకి ఎన్ సకెల్లా కంగ్రాట్స్ చెప్పారు. చంద్రయాన్ 3 విజయం కేవలం ఇండియాదే కాదని.. మొత్తం ప్రపంచానిది అని ప్రధాని మోదీ అన్నారు. ఈ మిషన్ ద్వారా సేకరించిన డేటా ప్రపంచ దేశాలన్నింటికీ ఎంతో సహాయపడుతుందని తెలిపారు. మూన్ మిషన్ చేపట్టే దేశాలన్నింటికి ఇండియా హెల్ప్ చేస్తుందని ప్రకటించారు. ఇండియాతో గ్రీస్ ఫ్రెండ్​షిప్ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షురాలు ఎన్ సకెల్లా అన్నారు.

చర్చల కోసం మేం రిక్వెస్ట్ చేయలే: కేంద్రం

బ్రిక్స్ సమిట్​లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఇండియా రిక్వెస్ట్ చేయడంతో మోదీతో జిన్​పింగ్ మాట్లాడారంటూ చైనా మీడియా కథనాలు ప్రసారం చేసింది. అయితే, ద్వైపాక్షిక సమావేశం కోసం చైనానే కోరిందని.. అది పెండింగ్‌‌లో ఉందని కేంద్రం వెల్లడించింది. చైనాకు ఇండియా ఎలాంటి రిక్వెస్ట్ చేయలేదని పేర్కొంది.

గ్రీస్ అత్యున్నత పురస్కారంఅందుకున్న మోదీ

గ్రీస్ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ హానర్’ను ప్రధాని మోదీకి ఆ దేశ ప్రెసిడెంట్​సెకల్లా అందజేశారు. ఇది గ్రీస్, ఇండియా బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని సకెల్లా అన్నారు. తమ దేశాన్ని సందర్శించిన విదేశీ ప్రధానులు, అధ్యక్షులకు ఆ దేశ ప్రెసిడెంట్ ఈ పురస్కారాన్ని అందజేస్తుంటారు. పురస్కారం అందుకోవడం ఎంతో  సంతోషంగా ఉందని మోదీ అన్నారు. సకెల్లాతో పాటు గ్రీస్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఫొటోను ట్విటర్​లో పోస్ట్​ చేశారు.

సౌతాఫ్రికా ప్రెసిడెంట్​కు తెలంగాణ సురాయి గిఫ్ట్​

ఇండియా సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే కళాఖండాలను సౌతాఫ్రికా, బ్రెజిల్ అధ్యక్షులకు ప్రధాని మోదీ అందజేశారు. తెలంగాణలో తయారైన ‘సురాయి’ జతను సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసాకు, కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన నాగాలాండ్​కు చెందిన శాలువాను ఆయన భార్యకు మోదీ గిఫ్ట్​గా ఇచ్చారు. కర్నాటకలోని బీదర్​లో మాత్రమే దొరికే జింక్, రాగి, నాన్ ఫెర్రస్ లోహాలతో సురాయిని తెలంగాణలో తయారు చేస్తారు. బీదర్ కోటలోని స్పెషల్ మట్టితో కలిపిన ద్రావణంలో సురాహ్​ను నానబెట్టి ఫినిషింగ్ ఇస్తారు. ఇక, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు మధ్యప్రదేశ్​కు చెందిన గోండు పెయింటింగ్​ను మోదీ గిఫ్ట్​గా ఇచ్చారు.