5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం పచ్చజెండా

5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం పచ్చజెండా

5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. దీనికి సంబంధించి టెలీ కమ్యూనికేషన్ విభాగం సమర్పించిన  ప్రతిపాదనలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని  కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. దీంతో 5జీ నెట్వర్క్ సేవలను ప్రైవేటు టెలికాం సంస్థలు అందించేందుకు మార్గం సుగమమైంది.  జూలై నెలాఖరులో నిర్వహించనున్న  వేలంలో ఎక్కువ బిడ్డింగ్ దాఖలు చేసే టెలికాం కంపెనీలకు 5జీ స్పెక్ట్రమ్ను కేటాయించనున్నారు.  20 ఏళ్ల  కాలపరిమితి కోసం మొత్తం 72097.85 మెగా హెర్ట్జ్ల 5జీ  స్పెక్ట్రమ్ ను వేలం వేయనున్నారు. ఈ వేలంలో వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జియో కంపెనీలు పాల్గొనే అవకాశం  ఉంది.  5 జీ స్పెక్ట్రమ్  బిడ్డింగ్ ను దక్కించుకునే టెలికాం కంపెనీలు ఆ మొత్తాన్ని 20 ఈఎంఐలలో చెల్లించే వెసులుబాటును కల్పించనున్నారు.  5జీ ఇంటర్నెట్ సేవలు 4జీతో పోల్చుకుంటే.. 10 రెట్లు వేగంగా  ఉంటాయని కేంద్ర సర్కారు చెబుతోంది.