పాలనలో మోదీ ఫెయిల్.. ప్రజల త్యాగాలు చేయాలనడం ప్రధాని వైఫల్యమేను: రాహుల్ గాంధీ

పాలనలో మోదీ ఫెయిల్.. ప్రజల త్యాగాలు చేయాలనడం  ప్రధాని వైఫల్యమేను: రాహుల్ గాంధీ
  • 12 ఏండ్ల పరిపాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని ఫైర్
  • ప్రజలు ఏం కొనాలి, ఏం కొనొద్దు, 
  • ఎక్కడికి వెళ్లాలో చెప్పే దుస్థితికి తెచ్చారని విమర్శ
  • దేశం ప్రధాని ఆధీనంలో లేదు: కేసీ వేణుగోపాల్
  • ఎన్నికలు ముగిశాకే గుర్తొచ్చిందా?: అఖిలేశ్ ​యాదవ్
  • అసమర్థతను కప్పిపుచ్చుకుంటున్నరు: జైరాం రమేశ్


న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశ ప్రజలు వచ్చే ఏడాది వరకు బంగారం కొనొద్దని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. బంగారం కొనొద్దని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని చెబుతూ ప్రజలను త్యాగాలకు సిద్ధం కావాలనడం ప్రధాని వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. 

గత పన్నెండేళ్ల పాలనలో దేశాన్ని భ్రష్టు పట్టించారని, ప్రజలు ఏం కొనాలి, ఏం కొనొద్దని చెప్పే స్థాయికి దిగజార్చారని విమర్శించారు. ‘‘ప్రజలు వారి జీవితంలో కొన్ని త్యాగాలు చేయాలని మోదీ కోరారు. ‘బంగారం కొనవద్దు, విదేశాలకు వెళ్లవద్దు, పెట్రోల్  తక్కువ వాడండి, మెట్రో వంటి ప్రజారవాణా సాధనాలు  వాడండి, మళ్లీ వర్క్ ఫ్రం హోంకు మారండి’ అంటూ మోదీ పలు సూచనలు చేశారు. దేశ ప్రజలు ఏం కొనాలో, ఏం కొనకూడదో, ఎక్కడికెళ్లాలో కూడా ఆయనే డిసైడ్  చేస్తారా? ఆయన చేసిన సూచనలు, వినతులు పాలనా వైఫల్యానికి పూర్తి నిదర్శనం” అని అన్నారు .


మోదీ ఎప్పటికప్పుడు బాధ్యత మొత్తం ప్రజలపైకి నెట్టి తన జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటారు. ఇది ఆయనకు అలవాటే” అని రాహుల్  ‘ఎక్స్’ లో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశం ప్రధాని మోదీ ఆధీనంలో లేదని ఆయన ఎద్దేవా చేశారు.

  • ప్రధానికి ఏంచేయాల్నో అర్థం కావట్లేదు: కేసీ

దేశ ఇంధన భద్రత విషయంలో ఏం చేయాలో ప్రధానికి అర్థం కావడంలేదని కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శించారు. దేశం ప్రధాని ఆధీనంలో లేదని తీవ్ర విమర్శలు చేశారు. ఇది చెయ్యి, అది చెయ్యి అంటూ సామాన్యులను అసౌకర్యానికి గురిచేయడం పూర్తిగా సిగ్గుమాలిన విషయమని ఆయన మండిపడ్డారు. దేశం సంక్షోభంలో పడకుండా ప్రయత్నించాల్సింది పోయి ప్రజలకు సలహాలు ఇవ్వడంపై మండిపడ్డారు. జనం ఇబ్బంది పడకుండా సరిపడా ఆయిల్ రిజర్వ్ లు అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. మరో నేత కార్తి చిదంబరం కూడా ప్రధాని సూచనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితిపై అత్యవసరంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు ఆయన డిమాండ్  చేశారు.

  • ఎన్నికలు ముగిశాకే గుర్తొచ్చిందా?: అఖిలేశ్ 

ఇటీవలి ఐదు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రధానికి ఈ ‘సంక్షోభం’ గుర్తుకు వచ్చిందంటూ అఖిలేశ్ యాదవ్ విస్మయం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో బీజేపీ నాయకులు వేల సంఖ్యలో చార్టర్డ్ విమానాలు వాడారని, అప్పుడు గుర్తుకు రాని పొదుపు మంత్రం ఇప్పుడెందుకు గుర్తొచ్చిందని  ప్రశ్నించారు. ఆ విమానాలు ఏమైనా నీళ్లతో నడిచాయా అని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తన ఆర్థిక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి దేశభక్తిని అడ్డుపెట్టుకుంటోందని ఆయన ఆరోపించారు. దేశంలో నెలకొన్న వాస్తవ పరిస్థితులను పక్కదారి పట్టించి, సామాన్యులపై త్యాగాల పేరుతో భారాన్ని మోపడం సరికాదని అఖిలేశ్ 
విమర్శించారు.

  • ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటోంది: జైరాం రమేశ్

ప్రధాని మోదీ ప్రసంగం భవిష్యత్తులో రాబోయే కఠినమైన ఆర్థిక పరిస్థితులకు ముందస్తు సంకేతమని కాంగ్రెస్ సీనియర్​నేత జైరాం రమేశ్ విమర్శించారు. ముఖ్యంగా ఇంధన ధరల భారీ పెంపును ప్రజలు సులభంగా అంగీకరించేలా చేసేందుకు ప్రభుత్వం ముందుగానే ఇటువంటి భయాందోళనతో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం అమలు చేయబోయే కఠినమైన వ్యయ నియంత్రణ చర్యల వల్ల సామాన్యుల జేబులకు చిల్లు పడటం ఖాయమని ఆయన హెచ్చరించారు. అంతర్జాతీయ పరిస్థితులను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటోందని, ప్రజల ఆహారపు అలవాట్లపై కూడా కోత విధించమనడం బాధ్యతారాహిత్యమని ఆయన మండిపడ్డారు. ఈ ప్రసంగం ప్రజలపై ఆర్థిక భారం మోపడానికి వేసిన ముందస్తు పునాది మాత్రమేనని జైరాం రమేశ్ విమర్శించారు.

  • బంగారం కొనొద్దని మోదీ అనడం విడ్డూరం: తేజస్వి

ప్రధాని మోదీ వైఖరిలోని వైరుధ్యాన్ని ఎత్తిచూపుతూ ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు. 2024 లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ప్రచారంలో, హిందూ మహిళల నుంచి ‘మంగళసూత్రాలను’ లాక్కోవడానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని మోదీ ఆరోపించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో సంప్రదాయబద్ధంగా బంగారం కలిగి ఉండటాన్ని గట్టిగా సమర్థించిన ప్రధాని.. ఇప్పుడు అదే పౌరులను బంగారం కొనవద్దని కోరడం విడ్డూరంగా ఉందని తేజస్వి యాదవ్  ‘ఎక్స్’ వేదికగా ఎద్దేవా చేశారు.