
- టెర్రరిస్టుల డెన్లు ఎక్కడున్నా దాడి చేయగలం
- బలహీన ప్రభుత్వం కోసం వారంతా చూస్తున్నారు
- దేశం సేఫ్ గా ఉంటేనే మన ఆశలు నెరవేరతాయి
- యూపీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ
అయోధ్య(ఉత్తరప్రదేశ్): మన దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు టెర్రరిజమని, ఇండియాలో బలహీన ప్రభుత్వం రావాలని పొరుగు దేశాల్లోని టెర్రర్ ఫ్యాక్టరీలన్నీ ఎదురుచూస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ప్రస్తుతం ఉన్నది సరికొత్త ఇండియా అని, ఇది టెర్రరిస్టుల డెన్లపై బోర్డర్ లోపల, బయట కూడా దాడి చేయగలదని వెల్లడించారు. టెర్రరిస్టులు మనల్ని డిస్టర్బ్ చేస్తే సహించేది లేదని, బుల్లెట్లకు బుల్లెట్లతోనే సమాధానం చెబుతామని, దేశం సురక్షితంగా ఉంటేనే.. మన ఆశలు కూడా నెరవేరుతాయని అన్నారు. మన దేశం, మన సంస్కృతి సురక్షితంగా ఉండాలంటే అందరూ కమలం గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు.
బుధవారం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్వహించిన ఎన్నికల సభలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెర్రరిజం, దాని వల్ల ఎదురయ్యే ముప్పుపైనే ప్రధాని ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈస్టర్ రోజున శ్రీలంకలో జరిగిన టెర్రర్ అటాక్‌లను గుర్తు చేస్తూ.. 2014కు ముందు మనదేశంలో కూడా అలాంటి పరిస్థితులే ఉండేవని, అయోధ్యలో జరిగిన దాడి గురించి మరచిపోగలమా? అప్పట్లో రోజు కొకటి చొప్పున దేశంలో దాడులు జరిగేవని చెప్పారు. గత ఐదేళ్లలో దాడులకు సంబంధించిన వార్తలు ఆగిపోయాయన్నారు. దీంతోనే టెర్రరిజం ఆగిపోయినట్టు కాదని, పొరుగు దేశంలో టెర్రరిజం ఫ్యాక్టరీలు కొనసాగుతున్నాయని, అక్కడ టెర్రరిజం ఒక పరిశ్రమ అని, వారి వ్యాపారం కూడా అదే అని, వారంతా బలహీన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని, అందుకోసం వారంతా ఎదురుచూస్తున్నారని ప్రధాని హెచ్చరించారు.
ఎస్పీ-బీఎస్పీ కూటమిపై ఫైర్
ఎస్పీ–-బీఎస్పీ కూటమి, కాంగ్రెస్ పార్టీలు టెర్రరిజంపై చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నాయని మోడీ ఆరోపించారు. నిఘా ఏజెన్సీలు ఎంతో కష్టపడి టెర్రరిస్టులను పట్టుకుంటే.. ఓట్ల కోసం ఈ పార్టీలు వారిని వదిలేశాయని గుర్తుచేశారు. ఎస్పీ, బీఎస్పీ పేదలకు చేసింది ఏమీ లేదని, అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా పేర్లను దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. పేదల గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. మాయావతి అంబేద్కర్ పేరును వాడుకుంటారని, కానీ ఆయన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తారని, ఎస్పీ కూడా లోహియా పేరును ప్రతి అడుగులోనూ వాడుకుంటూ ఆయన పేరును దిగజారుస్తోందని ఆరోపించారు.
ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ 40 కోట్ల మంది కార్మికులను తమ ఓటు బ్యాంకుగా భావిస్తున్నాయని, తమ కోసం తమ కుటుంబ ప్రయోజనాల కోసం వారిలో చిచ్చు పెడుతున్నాయని ఆరోపించారు. జనాల ప్రేమే తనకు నిజమైన ఆస్తి అని, రాముడు జన్మించిన ఈ గడ్డ దేశానికే గర్వకారణమని అన్నారు. మన సంస్కృతిని ఇతర దేశాలకు వ్యాపించేందుకు ప్రయత్నిస్తున్నామని మోడీ చెప్పారు. ఈ ఏడాది కుంభమేళాకు పటిష్టమైన ఏర్పాట్లు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని మోడీ అభినందించారు. 1954లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి వేలాది మంది చనిపోయారని, ప్రభుత్వం పేరును కాపాడుకునేందుకు ఈ దారుణమైన ఘటనను దాచిపెట్టారని ఆరోపించారు.
జాకిర్ నాయక్ ను డిగ్గీరాజా భుజాలమీద ఎత్తుకుని మరీ డాన్స్ చేశారు.టెర్రరిజంపై పోలీస్ ఆఫీసర్లకు నాయక్ క్లాసు లు చెప్పించారు. ఈస్టర్ సండే తర్వాత ఆయన టీవీ చానెల్ ను శ్రీలంక్ మూసేసింది. మనదేశంలో మాత్రం అంతకుముందున్న ప్రభుత్వాలు నాయక్ ను శాంతిదూతగా ప్రొజెక్ట్ చేశారు. కాంగ్రెస్ నిజాయితీలేని పార్టీ. కుటుంబపాలన, అవినీతిని ప్రచారం చేసుకోవడంలోనే అది నిజాయితీని ప్రదర్శిస్తుంది.- ఇటార్సీ(మధ్యప్రదేశ్) సభలో మోడీ