- ఈ పరిస్థితిని ప్రధాని మోదీ ముందే ఊహించారు: కిషన్ రెడ్డి
- రెంజీ సదస్సులో కేంద్ర మంత్రి
గచ్చిబౌలి, వెలుగు: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ సెక్యూరిటీ ఆందోళనకరంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను 12 ఏండ్ల క్రితమే ఊహించిన ప్రధాని మోదీ.. భారతదేశ ఇంధన భద్రతకు సరికొత్తగా ఊపిరి పోశారన్నారు. సంప్రదాయ వనరులపై దేశం అతిగా ఆధారపడే పరిస్థితులు రాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ వినియోగాన్ని నిరంతరం ప్రోత్సహిస్తున్నారని, పర్యావరణాన్ని కాపాడుతూనే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా ‘క్లీన్ ఎనర్జీ విప్లవం’ తీసుకొచ్చారని వివరించారు.
శనివారం హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ‘ది కోరమ్’లో నేషనల్ ఫోరం రెంజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రెనర్జైన్ 2026’ సదస్సును చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నేడు దేశంలో గ్రీన్ ఎనర్జీ అనేది కేవలం ప్రభుత్వ విధానంగా కాకుండా ఒక శక్తివంతమైన ప్రజా ఉద్యమంగా మారిందన్నారు.
ప్రజలపై ఆర్థిక భారం పడకుండా సోలార్ ఎనర్జీ వైపు సులభంగా మారేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ యోజన, పీఎం కుసుమ్ వంటి పథకాల ద్వారా 70 శాతం వరకు సబ్సిడీలను అందిస్తోందని చెప్పారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, ఇంధన అవసరాలకు కేంద్రం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో డి-సెంట్రలైజ్డ్ గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం అదనంగా 450 మెగావాట్ల సామర్థ్యాన్ని ఆమోదించడంతో పాటు సాగు కోసం 20,000 సోలార్ అగ్రికల్చర్ పంప్ సెట్లను కేటాయించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెంజీ సంస్థ ఫౌండర్ ఆకుల మణికంఠతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
19వ రోజ్‌గార్ మేళా.. 51 వేల మందికి నియామక పత్రాలు..
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ బోయిగూడలోని ‘రైల్ కళారంగ్’లో శనివారం జరిగిన 19వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో అభ్యర్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. వర్చువల్‌గా జరిగిన ఈ మేళా ద్వారా దేశవ్యాప్తంగా 51 వేల మంది అభ్యర్థులు ఉద్యోగ నియామక పత్రాలు అందుకోగా, సికింద్రాబాద్‌లో 220 మంది యువతకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు.
