ఈశాన్య రాష్టాల గురించి విపక్షాలు మాట్లాడడం సిగ్గుచేటు : మోదీ

ఈశాన్య రాష్టాల గురించి విపక్షాలు మాట్లాడడం సిగ్గుచేటు : మోదీ

భారతదేశం దేశం మణిపూర్ వెంట ఉందని చెప్పారు ప్రధాని మోదీ. అధికారం లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఇంతహీనంగా మాట్లాడుతారా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ చరిత్ర భారతదేశాన్ని చిన్నాభిన్నాం చేసిందన్న మోదీ.. విపక్షాలకు అవిశ్వాసం ఆటగా మారిందన్నారు. మణిపూర్ ను మళ్లీ డెవలప్ మెంట్ ట్రాక్ లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తనను మూడు సంఘటనలు బాధపెట్టాయన్నారు. 1966లో మిజోరంపై కాంగ్రెస్ పార్టీ దాడి చేయించిందని చెప్పారు. 

అనాడు లోహియా చేసిన వ్యాఖ్యలు మనం గుర్తుచేసుకోవాలన్నారు. ఉద్దేశపూర్వకంగానే నెహ్రూ ఈశాన్యాన్ని అభివృద్ధి చేయలేదని లోహియా చెప్పారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలను కావాలనే నిర్లక్ష్యం చేశారన్నారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రం గురించి విపక్షాలు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ఆలోచనలు ఎప్పుడూ ఎన్నికల చుట్టే తిరుగుతాయన్నారు. ప్రశ్నించినవాళ్లకు వినే ధైర్యం కూడా ఉండాలని చెప్పారు. భారతమాతపై విపక్ష నాయులు చేసిన మాటలు ప్రతి ఒక్కర్నీ బాధించాయన్నారు. 

ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందన్నారు మోదీ. 1962లో నెహ్రూ రేడియా ప్రసంగం అసోం ప్రజలకు ఇప్పటికీ ఒక పీడకల అని చెప్పారు. ఈశాన్య భారతదేశం గురించి వీళ్లా చెప్పేది..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను 50సార్లు ఈశాన్య భారత్ లో పర్యటించానని గుర్తు చేశారు. మార్చి 5, 1966న మిజోరంలోని నిస్సహాయులపై కాంగ్రెస్ దాడి చేయించదన్నారు. వైమానిక దళం ద్వారా కాంగ్రెస్ వారిపై దాడి చేయించిందని, మిజోరంలో ఇప్పటికీ మార్చి 5న శోకదినం పాటిస్తారని చెప్పారు. ఆ గాయాన్ని మాన్పేందుకు కాంగ్రెస్ ఏనాడు ప్రయత్నించలేదన్నారు. 
ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ దేశం ముందు దాచి పెట్టిందన్నారు మోదీ.

దేశంలో మన దేశ ప్రజలపై ఇందిరిగాంధీ దాడి చేయించారని ఆరోపించారు మోదీ. అకల్ తఖ్త్ పై కూడా దాడి చేసేందుకు ముందుకెళ్లారని తెలిపారు. 1962 నాటి రేడియా సందేశం ఈశాన్య ప్రజలను నేటికి గుచ్చుకుంటూనే ఉందన్నారు. తమకు అందరి తోడు, అందరి అభివృద్ధి అన్నదే తమ  సిద్దాంతం అని చెప్పారు. తనకు ధైర్యం.. సహనం ఉందని..అన్ని భరిస్తానని చెప్పారు మోదీ. సభా నాయకుడిగా 2018లో విపక్షాలకు ఒక పని అప్పగించానని 2023లో అవిశ్వాసం తీసుకురమ్మని విపక్షానికి చెప్పానన్నారు. కనీసం విపక్షంలో ఉండే అర్హత అయినా సాధించాలంటూ చురకలంటించారు. 

2028లో మరోసారి విపక్షాలకు అవకాశం ఇస్తానని చెప్పారు మోదీ. అయితే.. 2028లో అవిశ్వాసం పెట్టినప్పుడు సిద్ధమై రావాలని కోరుతున్నామన్నారు. కనీసం విపక్షంలో ఉండే అర్హత అయినా సాధించాలని చెప్పారు. కొంచెం హోం వర్క్ చేసి వస్తే బాగుంటుందని సూచించారు. దేశంలోని తొలి స్పోర్ట్స్ మ్యూజియం మణిపూర్ లో రాబోతోందని చెప్పారు. నార్త్ ఈస్ట్ లో అనేక మందికి పద్మ పురస్కారాలు అందించామని తెలిపారు.