మోదీ ‘వృక్షాసనం’!.. గ్రాఫిక్ వీడియోను షేర్ చేసిన ప్రధాని

మోదీ ‘వృక్షాసనం’!..  గ్రాఫిక్ వీడియోను షేర్ చేసిన ప్రధాని

న్యూఢిల్లీ:  ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఉద్యోగులు, స్టూడెంట్లు, మహిళలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఫోన్లు, కంప్యూటర్ల వంటివి అతిగా వాడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. ఇలాంటి జీవనశైలి నుంచి పూర్తిగా బయటపడటానికి యోగా చక్కని సొల్యూషన్. అందుకే ప్రజలు తప్పనిసరిగా యోగా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ తరచూ చెప్తుంటారు. అయితే, ఈ నెల 21న  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మోదీ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేశారు. 

ఆ వీడియోలో మోదీని పోలిన గ్రాఫిక్ ఇమేజ్ వృక్షాసనం ఎలా వేయాలో చూపిస్తున్నది. ఈ ఆసనంతో కలిగే ప్రయోజనాలను చిత్రాల రూపంలో కూడా పొందుపర్చారు. ‘‘వృక్షాసనం మన శరీరానికి ఎంతో మంచిది. శరీర భాగాల సమతుల్యతను మెరుగుపరుస్తుంది’’ అని ప్రధాని ఆ వీడియోకు కామెంట్ జత చేశారు. చెట్టులాగా నిటారుగా  నిలుచుని వేసే ఆసనమే వృక్షాసనం. దీనితో ఒత్తిడి  తగ్గుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. ఛాతి, వెన్నెముక, మడమలు, కండరాలు, నాడులు బలపడతాయి.  పిల్లలు ఎత్తు పెరగడానికి, పెద్దలు బరువు తగ్గడానికీ ఇది ఉపయోగపడుతుంది. కాగా, భారత్ ప్రతిపాదన మేరకు 2015 నుంచి ఏటా జూన్ 21న  అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది.