
హైదరాబాద్, వెలుగు: ‘పరీక్షా పే చర్చ’ నిర్వహించే ప్రధాని మోదీ.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. ‘‘బిహార్‌లో నీట్ క్వశ్చన్ పేపర్‌ను రూ.30లక్షలకు అమ్ముకున్నరు. ఇప్పటికే కొంత మందిని అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయినా, కేంద్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. ఇన్ని ఆరోపణలు వస్తున్నా.. మోదీ సర్కార్ స్పందించకపోవడం దారుణం. లీక్ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలి. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’’అని కేటీఆర్ అన్నారు.
67 మందికి ఫస్ట్ ర్యాంకులా?
గతంలో ఎన్నడూ లేనివిధంగా నీట్ ఎగ్జామ్‌లో ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడంతో ఎన్నో అనుమానాలకు తావిస్తున్నదని కేటీఆర్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ‘‘ఒకే సెంటర్ నుంచి 8 మందికి 720 మార్కులు వచ్చాయి. దీన్ని బట్టే పేపర్ లీక్ అయిందని అర్థమవుతున్నది. అంతా సవ్యంగానే జరిగిందంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉన్నది. 1,563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఎందుకు ఇచ్చారు? తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు నష్టం జరగకుండా ఎంపీలు చర్యలు తీసుకోవాలి’’అని కేటీఆర్ అన్నారు.