తగ్గని మోడీ పాపులారిటీ.. 80% మంది మోదీ వైపే!

తగ్గని మోడీ పాపులారిటీ.. 80% మంది  మోదీ వైపే!
  • దేశంలో ప్రతి 10 మందిలో 8 మంది సానుకూలంగా ఉన్నారని రిపోర్టు
  • అంతర్జాతీయంగా మన ఇన్‌‌ఫ్లుయెన్స్ పెరుగుతున్నదన్న 70 శాతం మంది
  • ఇండియాపై ప్రపంచవ్యాప్తంగా 46 శాతం మంది సానుకూలం
  • ఫిబ్రవరి 20 నుంచి మే 22 వరకు 24 దేశాల్లోని 30,861 మందిపై సర్వే

వాషింగ్టన్: ప్రధాని నరేంద్ర మోదీ పాపులారిటీ ఏమాత్రం తగ్గలేదని మరోసారి వెల్లడైంది. 80 శాతం మంది భారతీయులు మోదీకి అనుకూలమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని అమెరికాకు చెందిన ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ రిపోర్టులో తేలింది. ప్రతి పది మంది భారతీయుల్లో 8 మంది ఆయనకు ఫేవరబుల్‌‌గా ఉన్నారని అందులో వివరించింది. ‘‘ఎన్డీఏకు మద్దతిచ్చే వాళ్లు.. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఇన్‌‌ఫ్లుయెన్స్ పెరుగుతున్నదని అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ వేదికపై భారతదేశం మరింత శక్తిమంతమవుతోందని పురుషులు ఎక్కువగా నమ్ముతున్నారు” అని పేర్కొంది. సెప్టెంబర్‌‌‌‌ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జీ20 సమ్మిట్ జరగనున్న నేపథ్యంలో ఈ రిపోర్టును ప్యూ రీసెర్చ్ సెంటర్ విడుదల చేసింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 20 నుంచి మే 22 వరకు ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లోని 30,861 మందిపై సర్వే చేసినట్లు వెల్లడించింది. ఇందులో 2,611 మంది ఇండియన్లు, 3,576 మంది అమెరికన్ల అభిప్రాయాలను సేకరించినట్లు చేసినట్లు చెప్పింది. ప్రధాని మోదీకి సంబంధించిన గ్లోబల్ వ్యూస్, గ్లోబల్ పవర్‌‌‌‌గా ఇండియా పరిధి, ఇతర దేశాలపై భారతీయుల అభిప్రాయాలు, ఇండియాపై ఇతర దేశాల అభిప్రాయాలను పరిశీలించడానికి ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది.

 

చైనాపై భారీగా పెరిగిన వ్యతిరేకత

అమెరికా ఇన్‌‌ఫ్లుయెన్స్ మరింత శక్తిమంతమవుతోందని  49 శాతం మంది చెప్పగా, ఏమీ మారలేదని 29 శాతం మంది చెప్పారు. రష్యా బలం పెరుగుతోందని 41 శాతం మంది చెప్పగా, ఏమీ మారలేదని 29 శాతం మంది చెప్పారు. చైనా బలం పెరుగుతోందని 38 శాతం మంది చెప్పగా, తగ్గుతోందని 31 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది సర్వే జరిపిన 24 దేశాల్లో భారత్‌‌ మాత్రమే ప్రత్యేకించి.. రష్యాపై అనుకూలమైన అభిప్రాయం చెప్పిందని, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌‌పై విశ్వాసం ఉందని చెప్పిందని పేర్కొంది. ప్రపంచంపై రష్యా ప్రభావం బలపడిందని ప్రతి పది మందిలో నలుగురు ఇండియన్లు అభిప్రాయపడ్డారని వివరించింది. 

2019లో సర్వే చేసిన దానితో పోలిస్తే ప్రస్తుతం చైనాపై వ్యతిరేకత భారీగా పెరిగిపోయింది. మూడింట రెండొంతుల మంది భారతీయులు చైనాపై వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చైనాపై అత్యధిక మంది ప్రతికూల అభిప్రాయాలను కలిగి ఉన్న ఏకైక మధ్య-ఆదాయ దేశంగా ఇండియా నిలిచింది” అని తెలిపింది. 2013 నుంచి పాకిస్తాన్‌‌పైనా వ్యతిరేకత పెరిగినట్లు చెప్పింది. బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాల గ్లోబల్ ఇన్‌‌ఫ్లుయెన్స్ కొన్నేండ్లుగా స్థిరంగానే ఉందని 40 శాతం మంది ఇండియన్లు అభిప్రాయపడ్డారని పేర్కొంది. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, పోలండ్, యూకే దేశాల్లో ఇండియాపై అనుకూలత తగ్గి, ప్రతికూలత పెరిగిందని సర్వేలో తెలిపింది. 

మోదీ పాపులారిటీ అట్లనే ఉంది: బీజేపీ

‘ప్యూ’ సర్వే ఫలితాలపై బీజేపీ స్పందించింది. ప్రధాని మోదీ పాపులారిటీ అలాగే ఉందని చెప్పుకొచ్చింది. ‘‘ఇండియాలోని మెజారిటీ ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు.. ఇండియా గ్లోబల్ ఇన్‌‌ఫ్లుయెన్స్‌‌ మరింత బలోపేతం అవుతోందని నమ్ముతున్నారు. ఇందుకు ప్యూ సర్వేనే నిదర్శనం” అని ట్వీట్ చేసింది. 

‘టర్మినేటర్‌‌’ను‌‌ గుర్తు చేసేలా మోదీ పోస్టర్

ముంబైలో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశం నేపథ్యంలో ‘టర్మినేటర్’ను గుర్తు చేసేలా మోదీ ఫొటోను బీజేపీ ట్వీట్ చేసింది. ఆర్నాల్డ్‌‌ ముఖం ప్లేస్‌‌లో మోదీ ముఖాన్ని పెట్టింది. అలాగే టర్మినేటర్ ఫేమస్‌‌ డైలాగ్‌‌ ‘ఐ విల్‌‌ బి బ్యాక్‌‌’ అని క్యాప్షన్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాలు ఏకమవుతున్న నేపథ్యంలో మళ్లీ తామే వస్తామని చెప్పేందుకు బీజేపీ ఈ ట్వీట్ చేసింది. ‘‘ప్రధాని మోదీని ఓడిస్తామని ప్రతిపక్షాలు అనుకుం టున్నాయి. కలలు కనండి. టర్మినేటర్ గెలుస్తూనే ఉంటాడు” అని కామెంట్ చేసింది. 

స్కూలు పిల్లలతో రాఖీ వేడుకలు

రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. తన నివాసంలో వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థినులతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి స్టూడెంట్లు రాఖీ కట్టారు. వారితో మోదీ కొద్దిసేపు ముచ్చటించారు. చిన్నారులు మోదీతో చంద్రయాన్3 గురించి సానుకూల అభిప్రాయాలను పంచుకున్నారని, ఆదిత్య ఎల్-1 మిషన్‌‌పై ఉత్సాహం చూపారని పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది.

మన బలం పెరుగుతున్నది

మోదీకి 80 % మంది ఫేవరబుల్‌‌గా ఉండగా.. అందులో 55 % మంది అత్యంత అనుకూలంగా ఉన్నట్లు ‘ప్యూ’ సర్వేలో తేలింది. ఇటీవలి కాలంలో దేశం ఇన్‌‌ఫ్లుయెన్స్ మరింత పెరుగుతున్నదని ప్రతి పది మంది ఇండియన్లలో ఏడుగురు భావిస్తున్నట్లు వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న వాళ్లలో 46% మంది ఇండియా విషయంలో సానుకూలంగా ఉన్నారని, 34 % మంది సానుకూలంగా లేరని, మరో 16 % మంది తమ అభిప్రాయాన్ని చెప్పలేదని ప్యూ తెలిపింది. ఇజ్రాయెల్‌‌లో 71%, యూకేలో 66%, కెన్యాలో 64 %, నైజీరియాలో 60 %, సౌత్ కొరియాలో 58 %, జపాన్‌‌లో 55 % మంది ఇండియాపై ఫేవర్‌‌‌‌బుల్‌‌గా ఉన్నారు.